జేఎన్టీయూ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించడంతో.. విద్యార్థులు టీకా వేయించుకోవాలని కళాశాల యాజమాన్యాలు తల్లిదండ్రులకు సంక్షిప్త సందేశాలు పంపిస్తున్నాయి. ఇంజినీరింగ్ నాలుగో ఏడాది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేందుకు కాకినాడ, అనంతపురంలోని జేఎన్టీయూ లు.. ప్రాథమిక షెడ్యూలును ప్రకటించాయి. జేఎన్టీయూ కాకినాడ జులై 19 నుంచి 25, జేఎన్టీయూ అనంతపురం 12 నుంచి 19 వరకూ పరీక్షలు నిర్వహించనున్నాయి. కళాశాలలు మూసివేయడంతో ఇళ్లవద్ద ఉన్న విద్యార్థులు.. తమకు సమీపంలో పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకునే సదుపాయాన్ని కల్పించారు.
ఇందుకోసం విద్యార్థులు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలి. కాకినాడ వర్సిటీ మూడో తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఒకటో తేదీ నుంచి వెబ్‌సైట్‌లో లింక్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. అనంతపురం వర్సిటీ ఏడో తేదీలోపు వివరాలు పంపించాలని తెలిపింది. విశ్వవిద్యాలయాల షెడ్యూల్ విడుదల కావడంతో.. కళాశాలలు చివరి సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షల సమాచారాన్ని ఇప్పటికే విద్యార్థులకు అందించాయి. ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు సాధించినవారు, ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారు.. అకడమిక్ పరీక్షల కోసం ఇప్పటికే ఎదురుచూస్తున్నారు.