పరీక్షల నిర్వహణలో అధికారులంతా ఎవరివంతు వారు బాధ్యతగా పనిచేయాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ కోరారు. ఇన్విజిలేటర్లు అందరికీ వ్యాక్సిన్ వేసేందుకు చర్యలు ప్రారంభించామని మంత్రి తెలిపారు. దాదాపు 28 వేల మందికి వ్యాక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సిన్ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే కొందరు వేయించుకున్నారని, మిగిలిన వారందరికీ వ్యాక్సిన్ వేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.
పరీక్షా కేంద్రాల్లో థర్మల్ స్కానర్లు, మాస్క్లు ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు తక్షణమే జిల్లా వైద్య శాఖ అధికారులు పూర్తి చేయాలని సూచించారు. ప్రతి కేంద్రంలో ఒక ఐసొలేషన్ గదిని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కనీసం ప్రతిచోట 5 పీపీఈ కిట్లు అందుబాటులో ఉంచాలని, ఏర్పాట్లతో పిల్లల ఆరోగ్య భద్రతపై తల్లిదండ్రులకు నమ్మకం ఏర్పడాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికచ్చితమైన ఆదేశాలు ఇచ్చారని.. విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన సంగతి ప్రజలకు తెలుసునన్నారు.