రాష్ట్ర వ్యాప్తంగా కరోనా టీకా ఉత్సవం తొలిరోజు మందగొండిగానే సాగింది. నాలుగు రోజుల పాటు ఉత్సవంలా టీకాలను వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 25 లక్షల డోసులు కావాలని ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది . కానీ డోసులు రాకపోయేసరికి విశాఖపట్నం , అనంతపురం జిల్లాల్లో ఆదివారం ఒక్కరికీ వ్యాక్సిన్ ఇవ్వలేదు . పశ్చిమ గోదావరి జిల్లాలో 17 వందల 10 మందికి మాత్రమే టీకా ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లాలో 2 వేలు, శ్రీకాకుళంలో 3 వేల500, చిత్తూరులో 3 వేలు, కర్నూలులో 6 వేలు, గుంటూరులో 7 వేల మందికి టీకా వేశారు. ప్రస్తుతం ఈ జిల్లాల్లో వ్యాక్సిన్ నిల్వలు నిండుకున్నాయి . రాష్ట్రంలో సాధారణ సమయాల్లో రోజుకు లక్ష నుంచి లక్షన్నర డోసులు ఇస్తుండగా ఆదివారం ఈ సంఖ్య 40 వేలు దాటలేదు.
టీకా ఉత్సవాల్లో భాగంగా ఆదనపు వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. వ్యాక్సిన్ కొరత కారణంగా రాష్ట్రంలో ఎక్కువ చోట్ల వీటిని ప్రారంభించలేదు. జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాలు, నియోజకవర్గాల్లో అంతంతమాత్రంగానే ఏర్పాటు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా మొత్తం మీద ఏలూరులో మూడు కేంద్రాలు ఏర్పాటు చేసి 310 మందికి టీకా వేశారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండులో టీకా కేంద్రం ఏర్పాటు చేయగా ఆదివారం సాయంత్రం 5 గంటల వరకూ 120 మంది ఉద్యోగులు వ్యాక్సిన్ తీసుకున్నారు. కృష్ణలంకలో ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో 350 మంది టీకాలు వేయించుకున్నారు .