మాట్లాడడం సులువైంది!
ఇంతకుముందు ఎవరైనా స్నేహితులతో మాట్లాడాలంటే ఫోన్ చేసి మాట్లాడేవాళ్లం. అంతకుముందైతే కేవలం ఉత్తరాలు, లేదా కలుసుకొని మాట్లాడుకోవడమే.. మరి ఇప్పుడో.. సోషల్ మీడియా ద్వారా ఇరవై నాలుగ్గంటలు దగ్గరగానే ఉండచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడుకోవచ్చు. దీంతో ఎప్పుడూ స్నేహితులకు అందుబాటులోనే ఉండే అవకాశం లభించింది.
బృందంగానూ కలుసుకోవచ్చు..!
స్నేహితులంటే కేవలం ఒకరిద్దరు కాదు.. అంతా కలిస్తేనే ఆనందం. అందరూ కలిసి సరదాగా గడిపే రోజుల్ని మిస్సవ్వని వ్యక్తులు ఉండరంటే నమ్మండి. అలాంటి మీటింగులు కూడా టెక్నాలజీ వచ్చిన తర్వాత సులువైంది. వివిధ దేశాల్లో ఉన్న స్నేహితులంతా కలిసి ఏక కాలంలో మాట్లాడే వీలు ప్రస్తుతం టెక్నాలజీ కల్పిస్తోంది. దీని ద్వారా అందరూ వర్చువల్ గానే కలుసుకున్నా.. ఇంతకుముందు తాము కలిసి ఉన్నప్పుడు చేసిన అల్లరికి ఇదేమీ తక్కువ కాదంటే అతిశయోక్తి కాదు..
స్నేహితుల జీవితంలో చోటుచేసుకునే అపురూప ఘట్టాల్లోనూ పాలుపంచుకునే అవకాశం టెక్నాలజీ ద్వారా లభిస్తోంది. జూమ్, గూగుల్ మీట్ లాంటి వేదికల ద్వారా దగ్గర లేకపోయినా నిజంగా కలుసుకున్న భావనను సొంతం చేసుకునే అవకాశం కలుగుతోంది.