ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా బారిన పడుతున్న పారిశుద్ధ్య కార్మికులు - ఏపీలో కరోనా కేసులు

కరోనా వైరస్‌ సోకకుండా ప్రజలు వాడి బయటపారేస్తున్న మాస్క్‌లు, చేతితొడుగులు, శానిటైౖజర్‌ సీసాల సేకరణ పారిశుద్ధ్య కార్మికులకు సవాల్‌గా మారుతోంది. వ్యక్తిగత సంరక్షణ పరికరాలు అందుబాటులో లేకపోవడంతో వీటిని తొలగిస్తున్న కార్మికులు కరోనా బారిన పడుతున్నారు. గత పది రోజుల వ్యవధిలో రాష్ట్రంలో వంద మందికిపైగా కార్మికులకు వైరస్‌ సోకినట్లు చెబుతున్నారు.

used maskas
used maskas

By

Published : Aug 14, 2020, 10:06 AM IST

కరోనా వ్యాప్తికి ముందు రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లో నిత్యం 6,500 టన్నుల వ్యర్థాలు సేకరిస్తే గత మూడు నెలలుగా నిత్యం 6,800 మెట్రిక్‌ టన్నుల చొప్పున వ్యర్థాలు పోగవుతున్నాయి. అంటే నిత్యం దాదాపు 300 టన్నులకుపైగా వ్యర్థాలను అదనంగా పారిశుద్ధ్య కార్మికులు సేకరించాల్సి వస్తోంది. మాస్క్‌లు, చేతి తొడుగులు, శానిటైజర్ల వినియోగం పెరగడం వల్లనే వ్యర్థాలు ఈ స్థాయిలో పెరిగాయని చెబుతున్నారు. దీంతో ఈ వ్యర్థాలు పారిశుద్ధ్య కార్మికులకు కరోనా ముప్పు తెచ్చిపెడుతున్నాయి. వాస్తవంగా ఇలాంటి వాటిని క్రిమిరహితంగా మార్చాలన్న ఆదేశాలు ఉన్నా చాలా చోట్ల అమలుకు నోచుకోవడం లేదు. ఈ విషయంలో పుర, నగరపాలక సంస్థలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలున్నాయని కాలుష్య నియంత్రణ మండలి అధికారి ఒకరు తెలిపారు.

ఇదీ పరిస్థితి

ఇళ్ల నుంచి రోడ్లుపైకి వస్తున్న వారిలో 85 నుంచి 90 శాతం మంది మాస్క్‌లు వినియోగిస్తున్నట్లు పట్టణ సామాజికాభివృద్ధి విభాగ తాజా సర్వేలో వెల్లడైంది. వైద్య రంగంలో సేవలు అందిస్తున్న వారు మాస్క్‌లతోపాటు విధిగా చేతి తొడుగులు కూడా వాడుతున్నారు. వాడిన తరవాత వీటిని డస్ట్‌ బిన్లలో వేయాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే నగరాల్లోనూ అక్కడక్కడ మాత్రమే డస్ట్‌బిన్లు కనిపిస్తున్నాయి. దీంతో వీటిని రహదారులకు ఇరువైపులా లేదా మురికి కాలవల్లోనూ పడేస్తున్నారు. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, కాకినాడ, తిరుపతి, కర్నూలు, అనంతపురాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. చిన్నచిన్న పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి.

రక్షణ పరికరాలు లేక..

పుర, నగరపాలక సంస్థల్లో అరకొరగా వ్యక్తిగత సంరక్షణ పరికరాలు సరఫరా చేయడంతో వాడిపడేసిన మాస్క్‌లు, చేతి తొడుగులు, పీపీఈ కిట్లు సేకరిస్తున్న కార్మికులు కరోనా వైరస్‌ సోకి అనారోగ్యానికి గురవుతున్నారు. వీరికి మూడు నెలల క్రితం చేతి తొడుగులు ఒకసారి ఇచ్చి మళ్లీ రెండోసారి అత్యధిక పురపాలక సంఘాల్లో సరఫరా చేయలేదు. మాస్క్‌లు కూడా నెలకో జత ఇవ్వడం గగనమవుతోందని రాష్ట్ర మున్సిపల్‌ కార్మికులు, ఉద్యోగుల సంఘ ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు తెలిపారు. దీంతో అనంతపురం జిల్లాలో 30, కడపలో 25, విజయనగరంలో 30, విశాఖ జిల్లాలో 30 మందికిపైగా పారిశుద్ధ్య కార్మికులు కరోనా బారిన పడ్డారని ఆయన వివరించారు.

ఇదీ చదవండి:నేడు జాతినుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం

ABOUT THE AUTHOR

...view details