కరోనా వేళ ప్రయాణాలపై పెరిగిన జాగ్రత్త... ప్రజలను సెకండ్ హ్యాండ్ కార్ల వైపు నడిపిస్తోంది. అన్ని రంగాలూ కుదేలైన వేళ... సెకండ్ హ్యాడ్ కార్ల విక్రయాలు మాత్రం 40 శాతం వరకూ పెరగడమే ఇందుకు నిదర్శనం. చిన్నపాటి కార్లు సెకండ్స్‌లో... 70-80వేల రూపాయలకే దొరుకుతుండటం, బైక్ కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్నవారిని ఆలోచింపజేస్తోంది. అసలే కరోనాతో అభద్రత నెలకొన్న వేళ... కుటుంబమంతటికీ సరిపోయే చౌక కారు వారిని ఆకట్టుకుంటోంది. మరోవైపు... 5లక్షల రూపాయల్లో లభ్యమయ్యే ఆల్టో, శాంత్రో, పోలో లాంటి వాహనాలకు బదులు సెకండ్స్‌లో దొరికే హోండా సిటీ, స్విఫ్ట్ డిజైర్, వోక్స్ వేగన్ లాంటి దర్పం ఉట్టిపడే కార్లు ఎగువ మధ్య తరగతి వారిని ఆకర్షిస్తున్నాయి.
లాక్‌డౌన్ తర్వాత ఉత్పత్తి తిరిగి ప్రారంభించేందుకు బడా కార్ల తయారీ కంపెనీలు కూడా సతమతమవుతున్నాయి. సెకండ్స్ అమ్మకందారులు మాత్రం పెరిగిన డిమాండ్‌తో ఇప్పటికే ఉన్న స్టాకును సైతం క్లియర్ చేసుకొనే పనిలో పడ్డారు. లాక్‌డౌన్ తొలగింపు తర్వాత వారి వ్యాపారం 40 శాతం వరకూ ఊపందుకుంది. 2 నుంచి 5లక్షల రూపాయల లోపు వాహనాలకు ఇప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉందని చెబుతున్నారు.
అసలే తక్కువ ధరలో లభ్యమయ్యే సెకండ్స్ కారు, ఫైనాన్స్ సౌకర్యంతో మరింత సులభంగా మారుతోంది. వాహనం ధరలో 10 నుంచి 15 శాతం డౌన్‌పేమెంట్ చెల్లిస్తే, మిగిలినది ఫైనాన్సర్లే సమకూరుస్తున్నారు. వాహన వాల్యుయేషన్ నిపుణులు, ఫైనాన్సర్లు సెకండ్స్ కార్ల విక్రయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.