ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రైతులపై ఎరువుల పిడుగు - ఎరువులు తాజా వార్తలు

ముడిసరకులు, పెట్రో ధరల పెంపు ప్రభావం ఎరువుల రూపంలో రైతులను పిడుగులా తాకనుంది. ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభానికి ముందే డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువుల ధరలను పెంచాలని కంపెనీలు నిర్ణయించడమే దానికి కారణం. ఈ మేరకు టోకు వ్యాపారులకు సమాచారం అందింది. పెంపు సుమారు 58% ఉండటంతో అన్నింటి ధరలు భారీగా పెరగనున్నాయి.

యూరియా ధర పెంపు
యూరియా ధర పెంపు

By

Published : Apr 9, 2021, 6:49 AM IST

మొదలే సాగు వ్యయం పెరిగి, పండిన పంటలకు మద్దతు ధర దొరకని పరిస్థితుల్లో నానా ఇబ్బందులు పడుతున్న అన్నదాతలకు ఎరువుల ధరల పెంపు గుదిబండలా మారనుంది.'డై అమ్మోనియం ఫాస్ఫేట్‌' (డీఏపీ) 50 కిలోల బస్తా గరిష్ఠ చిల్లర ధర(ఎమ్మార్పీ) ప్రస్తుతం రూ.1200 ఉండగా, పెరిగిన ఉత్పత్తి వ్యయంతో రూ.1900 అవుతుందని 'ఇఫ్కో' కంపెనీ వ్యాపారులకు పంపిన సమాచారంలో తెలిపింది. ప్రస్తుతం చిల్లర, టోకు వ్యాపారుల వద్ద నిల్వ ఉన్న సరకును పాత ధరలకే అమ్మాలని, ఈ నెల ఒకటి నుంచి సరఫరా అయ్యే వాటికి మాత్రమే కొత్త ధరలు వర్తిస్తాయంది. ఇదే కాదు ఇతర కంపెనీలు కూడా ధరలు పెంచుతున్నట్లు జిల్లాల్లోని వ్యాపారులకు సమాచారం ఇచ్చాయి. ఆయా కంపెనీలు డీఏపీ ధరను రూ.1200 నుంచి రూ.1700 వరకూ పెంచాయి. తాజా పెంపుతో సాగువ్యయం గణనీయంగా పెరగనుంది.

ప్రస్తుత వేసవిలో పంటల సాగు లేనందున ఎరువులను రైతులు కొనడం లేదు. వచ్చే నెలాఖరు నుంచి కొనుగోళ్లు మొదలవుతాయి. అప్పటికి కొత్త ధరలతో కొత్త నిల్వలు జిల్లాలకు వస్తాయని ఓ కంపెనీ అధికారి చెప్పారు. యూరియా ధరలు కేంద్ర నియంత్రణలో ఉంటాయి. కాంప్లెక్స్‌, డీఏపీ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో.. దీని ధరలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ఖరీఫ్‌, రబీ సీజన్లలో కలిపి 18.50 లక్షల టన్నుల ఎరువులను వాడతారు. తెలంగాణలో రెండు సీజన్లలో కలిపి 13 లక్షల టన్నుల ఎరువుల విక్రయాలు జరుగుతాయి. పెరిగిన ఎరువుల ధరలతో రైతులపై భారీగా భారం పడనుంది.

ఎకరాకు రూ.4వేల నుంచి రూ.5వేల వరకు భారం..

ఎరువుల ధరల పెంపుతో రైతులపై సగటున ఎకరాకు రూ.4వేల నుంచి రూ.5వేల వరకు అదనపు భారం పడనుంది. వాణిజ్య పంటల రైతులు ఇంకా ఎక్కువ భారం మోయాల్సిందే.

* మిరప, పసుపులో ఎరువుల వినియోగం అధికం. సగటున ఎకరాకు 20 నుంచి 25 బస్తాల వరకు ఎరువులు వేస్తారు. వీటికే పెట్టుబడి రూ.20వేలకు పైగా అవుతుంది. ప్రస్తుతం ఒక్కో బస్తాపై సగటున 50% వరకు ధర పెరుగుతోంది. అంటే పెట్టుబడి మరో రూ.10వేలు అధికమవుతుంది.

* రాష్ట్రంలో 65 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారు. ఎకరాకు సగటున 8 బస్తాల ఎరువులు వేస్తుంటారు. బస్తాకు రూ.600 పెంపు ప్రకారం చూస్తే... ఎకరాకు రూ.4,800 వరకు అధికంగా పెట్టుబడి పెట్టాలి. అంటే రాష్ట్రవ్యాప్తంగా సాగు చేసే వరిపై ఏడాదికి రూ.3,120 కోట్ల మేర ఖర్చు భరించాలి.

* కూరగాయ పంటలు, పత్తి, సాగుకు ఎరువుల అవసరం ఎక్కువే. సగటున ఆరు బస్తాలకుపైనే వినియోగిస్తారు. వేరుసెనగ, కంది, సెనగ, మినుము, చెరకు, పొగాకు తదితర పంటలకు ఎకరాకు మూడు నుంచి నాలుగు బస్తాలు వేస్తుంటారు.

పాత డీఏపీ పాత ధరకే: ఇఫ్కో ప్రకటన..

పాత డీఏపీని పాత ధరలకే విక్రయించనున్నట్లు సహకార రంగంలోని ఇఫ్కో ప్రకటించింది. 50 కిలోల డీఏపీ సంచిని రూ.1,200కు, ఎంఓపీ, ఎన్‌పీకేలను రూ.925-1,185 మధ్య విక్రయిస్తామని తెలిపింది. మొత్తం 11.26 లక్షల టన్నుల సరకును అమ్మకానికి పెడతామని పేర్కొంది. కొత్త సరకుకు కొత్త ధర ఉన్నా, అవి ప్రస్తుతానికి రైతులకు విక్రయించడానికి కాదు. ఆ సరకును నిల్వ చేస్తారు. పాత నిల్వలు పూర్తయిన తరువాతనే కొత్త నిల్వలు రైతులకు అందుబాటులోకి వస్తాయని ఇఫ్కో ఎండీ అవస్థీ ట్విటర్‌లో తెలిపారు. భవిష్యత్తులో ధర తగ్గే అవకాశం కూడా ఉంటుందని చెప్పారు.

వ్యవసాయరంగ చరిత్రలో ఇదే మొదటిసారి..

పెరుగుతున్న డీజిల్‌ ధరలు, కూలిరేట్లకు అనుగుణంగా మద్దతు ధరలు పెంచడం లేదని రైతులు బాధపడుతున్న తరుణంలో.. ఎరువుల ధరలు ఒకేసారి 50% పెరిగితే పెట్టుబడులపై పెద్దఎత్తున ప్రభావం పడుతుంది. ఇది అమానుషం. వ్యవసాయ రంగ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున పెంచడం ఇదే మొదటిసారేమో. రైతులపై ఇంత భారం వేసే ఆలోచనను కేంద్రం సమీక్షించుకోకుంటే.. నిరసన ఎదుర్కోవాల్సి వస్తుంది. - ఎంవీఎస్‌ నాగిరెడ్డి, వైస్‌ఛైర్మన్‌, వ్యవసాయ మిషన్‌

ధరలను 50 శాతానికిపైగా పెంచడం దారుణం..

ఎరువుల ధరలను ఒక్కసారిగా 50 శాతానికిపైగా పెంచడం మోదీ ప్రభుత్వ రైతు వ్యతిరేక ధోరణికి నిదర్శనం. ఇప్పటికే పెరిగిన ఉత్పత్తి వ్యయం, కూలి ఖర్చులకు అనుగుణంగా పంటల ధరలు పెరగకపోవడంతో రైతులు, ముఖ్యంగా కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒకవైపు నాలుగు నెలల నుంచి దేశవ్యాప్తంగా లక్షలాదిమంది రైతులు నిరసనలు తెలియజేస్తున్నా... మోదీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కార్పొరేట్లు, కోటీశ్వరులకు వేల కోట్ల రూపాయల రాయితీలిస్తూ.. నూటికి 86 శాతంగా ఉన్న సన్న, చిన్న రైతులు, కౌలు రైతులపై గొడ్డలిపెట్టు వంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదు. కేంద్రం వెంటనే ఈ చర్యలను ఉపసంహరించుకోవాలి. - వడ్డే శోభనాద్రీశ్వరరావు, రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్‌

కౌలు రైతులపైనా పెను భారం..

ఎరువుల ధరల్ని 50% పైగా పెంచడం ద్వారా.. కరోనాలో కేంద్ర ప్రభుత్వం రైతులకు బహుమతి ఇచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు భరోసా కింద రైతుకు రూ.13,500 ఇచ్చి.. ఎరువుల ధరల పెంపు ద్వారా రూ.14వేలు దోచుకుంటున్నాయి. ఎరువుల ధరల పెంపుతో కౌలు రైతులపై పెనుభారం మోపారు. ఇప్పటికైనా కేంద్రం ఎరువుల ధరల తగ్గించాలి. - నాగబోయిన రంగారావు, పి.జమలయ్య, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, కౌలు రైతుల సంఘం

ఇదీ చదవండి:'కరోనాపై పోరు ఉద్ధృతం.. టెస్టింగే కీలకం'

ABOUT THE AUTHOR

...view details