ఉపాధి పనులకు వెళ్లే వారికి సగటున రూ.230 కూలీ మాత్రమే వస్తోంది. అదే వ్యవసాయ పనులకు వెళ్తే రోజుకు రూ.300 నుంచి రూ.500 వరకు సంపాదిస్తున్నారు. కరోనాతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో నరేగా పనులకు హాజరయ్యే వారి సంఖ్య భారీగా పెరిగింది. ఉపాధి కోసం రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాలకు వెళ్లి లాక్‌డౌన్‌తో తిరిగి స్వస్థలాలకు వచ్చిన వారందరినీ నరేగా ఆదుకుంది. అడిగిన వారందరికీ జాబ్ కార్డులివ్వాలని ఆదేశాలు రావడంతో హాజరు ఒకేసారి పెరిగింది. ప్రత్యేకించి అనంతపురం, చిత్తూరు, కర్నూలు, ప్రకాశం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ పనులకు హాజరయ్యారు. నరేగా ప్రారంభమయ్యాక రాష్ట్రంలో ఒక రోజులో హాజరు ఎప్పుడూ 38 లక్షలను దాటలేదు. ఈ ఏడాది గరిష్ఠంగా 55 లక్షలకు చేరుకుంది. ఈ నెల ప్రారంభం నుంచి వర్షాలు కురవడంతో వ్యవసాయ పనులు మొదలయ్యాయి. దీంతో కూలీలకు గిరాకీ ఏర్పడింది. కృష్ణా, కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి, గుంటూరు జిల్లాల్లో ఈ ప్రభావం నరేగా పనులపై కనిపిస్తోంది. గత నెలలో ఇదే జిల్లాల్లో రోజూ 5 లక్షల నుంచి 7 లక్షల మంది హాజరయ్యేవారు. ప్రస్తుతం 50 వేల మందీ రావడం లేదు. హాజరు తగ్గడంతో పలుచోట్ల ఉపాధి పనులు నిలిపి వేస్తున్నారు.
ఉపాధి హామీ పనులకు భారీగా తగ్గిన కూలీలు - ఉపాధి హామీ పనులకు భారీగా తగ్గిన కూలీలు
వ్యవసాయ పనులు ముమ్మరం కావడంతో జాతీయ ఉపాధి హామీ పథకం (నరేగా) పనులకు హాజరయ్యే వారి సంఖ్య రాష్ట్రంలో భారీగా తగ్గుతోంది. గత నెలలో రోజూ 50 లక్షల నుంచి 55 లక్షల మంది హాజరైనవారు ప్రస్తుతం 15 లక్షలకు మించి పనులకు రావడం లేదు. ఈ కారణంగా కొన్ని మండలాల్లో పనులను నిలిపి వేస్తున్నారు.
upadhi haami scheme in ap