"Paddy Damage in Jagtial : పండించిన అన్ని రోజులు ధాన్యం కొంటరో కొనరో అని గుబులు పడ్డాం. ఎండకు, వానకు ఓర్చి ఆరుగాలం కష్టపడి ఎట్టకేలకు పంట పండించినం. ధాన్యమంతా మేమే కొంటమని కేసీఆర్ సాబ్ చెబితే సంబురపడ్డం. మా ఇలాకాలో ధాన్యం కొనుగోలు కేంద్రం పెట్టంగనే ఆ సంబురం అంబురాన్నంటింది. పోయిన శుక్రవారం అధికారులు వచ్చి కొబ్బరికాయ కొట్టంగనే ఇగ ఈయేడు ధాన్యం గురించి బాధ లేదని ఆనందపడ్డం. మా ఊరోళ్లమంతా కోసుడు కోసుడే ధాన్యాన్ని కొనుగోలు కేెంద్రాలకు పట్టుకొచ్చినం. ఇప్పడికి వడ్లు తీసుకొచ్చి వారమైతంది. కొబ్బరికాయ కొట్టిండ్రు కానీ కొనుగోళ్లు మాత్రం మొదలుపెట్టలే. అసలు ఎవ్వలు ఇటు ముఖమే చూడలే మళ్లీ. నిన్న వర్షం దంచికొట్టింది. ఆ దెబ్బకు ఇక్కడ పోసిన వడ్లన్నీ నీళ్లల్ల కొట్టుకుపోయినయి. బస్తాళ్లల్లో ఉన్న వడ్లన్నీ తడిసిపోయినయి. ఇప్పుడు మేం ఏం చేసేది..?"
- జగిత్యాల జిల్లా రైతులు
RAINS: జగిత్యాలలో భారీ వర్షం.. అన్నదాతలు అతలాకుతలం..! - జగిత్యాల రైతులు
Paddy Damage in Jagtial: ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలకు తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో అన్నదాతలు అతలాకుతలమయ్యారు. మెట్‌పల్లి, కోరుట్ల, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాలతో పలు గ్రామాల్లో భారీ వర్షం కురవడంతో మొక్కజొన్న, సజ్జ, నువ్వు, మామిడి పంటలు నేలరాలాయి. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న పంట భారీ వర్షానికి కొట్టుకుపోయింది. పలు చోట్ల ధాన్యం తడిసిపోయి కర్షకులు నానా అవస్థలు పడ్డారు. జిల్లాలో పలు చోట్ల భారీ చెట్లు విరిగి రోడ్లపై, విద్యుత్ తీగలపై పడి సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
![RAINS: జగిత్యాలలో భారీ వర్షం.. అన్నదాతలు అతలాకుతలం..! Paddy Damage in Jagtial](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15306083-830-15306083-1652761193301.jpg)
Crop Damage in Jagtial : ఆదివారం రాత్రి ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షానికి తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో పంటలు ఆగమయ్యాయి. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం నీళ్లలో కొట్టుకుపోయింది. బస్తాల్లో ఉన్న వడ్లన్ని తడిసిముద్దయ్యాయి. పలుచోట్ల ధాన్యం తడిసి బియ్యం గింజలు బయటకొచ్చాయి. పలు గ్రామాలు లోతట్టు ప్రాంతాల్లో ఉండటం వల్ల వరద నీరు ఇళ్లలో చేరింది.
తడిసిన ధాన్యాన్ని ఆరబోయడానికి రైతులు నానాఅవస్థలు పడ్డారు. ఈదురుగాలలో కూడిన భారీ వర్షానికి జిల్లాలోని వరి, నువ్వులు, మొక్కజొన్న, మామిడి పంటసు నేలరాలాయి. కొన్నిచోట్ల భారీ వృక్షాలు విరిగి నేలకూలాయి. అవి రహదారికి అడ్డంగా పడటంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అర్ధరాత్రి 2 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ప్రజలు అవస్థలు పడ్డారు.
ఇవీ చదవండి:ఆ కాలేజీలకు షాక్.. వచ్చే విద్యాసంవత్సరంలో ప్రవేశాలు బంద్!