ఉమ్మడి ప్రవేశ పరీక్షల కౌన్సెలింగ్‌లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ పరీక్షలు రాసిన విద్యార్థులు ప్రవేశాల కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. విశ్వవిద్యాలయాలు సకాలంలో కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇవ్వకపోవడంతో ఉన్నత విద్యామండలి కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ప్రకటించడం లేదు. ఇప్పటి వరకు ఈఏపీసెట్ ఇంజినీరింగ్ కన్వీనర్ కోటా మొదటి విడత మాత్రమే పూర్తయింది. ఈ కౌన్సెలింగ్‌లోనూ కళాశాలల అనుబంధ గుర్తింపు జాబితా రాలేదని, సీట్ల కేటాయింపులో సాంకేతిక సమస్యలంటూ కాలయాపన చేశారు. బైపీసీ స్ట్రీమ్‌లో ఫార్మసీ ప్రవేశాలు నిర్వహించాల్సి ఉంది. ఇంజినీరింగ్ రెండో విడత ప్రవేశాలు చేపట్టాలి. ప్రస్తుతం ఈసెట్, పీజీఈసెట్ కౌన్సెలింగ్‌లు వివిధ దశల్లో ఉన్నాయి. ప్రవేశాల కౌన్సెలింగ్‌లో జాప్యం కారణంగా తరగతులు ప్రారంభం కావడం లేదు. దీంతో విద్యార్థులు ఇళ్ల వద్దనే ఉంటున్నారు. కరోనా కేసులు తక్కువగా ఉన్నందున విద్యా సంస్థలు పూర్తిస్థాయిలో తరగతులు నిర్వహిస్తున్నాయి. ఇలాంటి సమయంలోనూ ప్రవేశాలు జరగకపోవడంతో మొదటి ఏడాది వారు తరగతులకు హాజరు కాలేకపోతున్నారు.
అనుబంధ గుర్తింపు ఎప్పటికి..
ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, న్యాయవిద్య, పోస్టుగ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీజీసెట్‌లలో రాష్ట్ర వ్యాప్తంగా 83,876మంది అర్హత సాధించారు. అఖిల భారత సాంకేతిక విద్యామండలి సెప్టెంబరులోనే ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు అనుమతి ఇచ్చింది. వీటికి విశ్వవిద్యాలయాలు అనుబంధ గుర్తింపు ఇవ్వడంలో ఆలస్యం చేశాయి. ఇటీవలే వర్సిటీలు అనుమతులు ఇవ్వడంతో జాబితాను ఉన్నత విద్యాశాఖకు పంపారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. న్యాయ విద్య కళాశాలలకు మొదట వర్సిటీలు, ఆ తర్వాత బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో మొదటిసారిగా పోస్టుగ్రాడ్యుయేషన్(పీజీ) కోర్సులకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించారు. అన్ని విశ్వవిద్యాలయాలు, ప్రైవేటు కళాశాలల్లో మొత్తం 146కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహించాల్సి ఉంది. మొదట్లో డిగ్రీ ఫలితాలు పెండింగ్ ఉందంటూ కౌన్సెలింగ్ జాప్యం చేశారు. ఇప్పుడు దాదాపు అన్ని వర్సిటీలు ఫలితాలను విడుదల చేసినా ప్రవేశాలు నిర్వహించడం లేదు. ఎడ్‌సెట్‌దీ ఇదే పరిస్థితి.
ఇదీ చదవండి:గవర్నర్ బిశ్వభూషణ్‌కు మరోసారి అస్వస్థత