Infant baby at Asha worker home: తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన ఓ పసికందును ఆశా కార్యకర్త ఇంటి ముందు గుర్తు తెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. ఆ నవజాత శిశువు కేకలు విని బయటకు వచ్చిన ఆశా కార్యకర్త.. వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. అనంతరం ఈ విషయాన్ని 1098, 100కు సమాచారం అందించారు. పోలీసులు, బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ లైన్ అధికారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకుని విచారణ చేపట్టారు.
నిందితులను పట్టుకుంటాం..
అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పసికందును వదిలి వెళ్లారని.. పాపకు గ్రహణమొర్రి ఉందని బాలల పరిరక్షణ విభాగం అధికారి నరేశ్ తెలిపారు. సరైన వైద్యం కోసం మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. పరిస్థితి మెరుగుపడ్డాక చైల్డ్ వెల్ఫేర్ సంస్థ ఎదుట హాజరు పరిచి, వరంగల్ శిశు సంరక్షణ కేంద్రానికి తరలిస్తామని పేర్కొన్నారు.