Union Forest Ministry on Rayalaseema Lift Project: రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి సంబంధించి పర్యావరణ నిపుణుల మదింపు కమిటీ అడిగిన సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటీ సమర్పించలేదని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ లోక్‌సభకు తెలిపింది. 2006 ఎన్విరాన్‌మెంట్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ నోటిఫికేషన్ కింద రాయలసీమ లిఫ్ట్ స్కీంను చేర్చేలా ప్రస్తుత పర్యావరణ అనుమతులను సవరించాలని కోరుతూ.. 2021 జూన్ 8న రాష్ట్ర సర్కారు ప్రతిపాదనలు పంపినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే.,. ఈ ప్రతిపాదనలపై ఈ ఏడాది జూన్ 16, 17... జులై 7వ తేదీల్లో జరిగిన నిపుణుల మదింపు కమిటీలో చర్చ జరిగిందని, ఈ ప్రాజెక్టుకు సంబంధించి నాలుగు అంశాలపై మరింత సమాచారం ఇవ్వాలని సదరు కమిటీ కోరిందని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి అశ్వినీకుమార్ చౌబే తెలిపారు.
కమిటీ సంపూర్ణ నివేదిక కోరింది..
నదిలో నీటి లభ్యతపై సంపూర్ణ నివేదిక ఇవ్వాలని.. దానిపై ఆధారపడి ప్రస్తుతం ఉన్న, భవిష్యత్తులో చేపట్టబోయే పథకాలు, జల విద్యుత్తు కేంద్రాల వివరాలను రివర్ డెవలప్‌మెంట్ కోసం అనుమతించిన మాస్టర్‌ప్లాన్‌లో చెప్పిన విధంగా సమర్పించాలని కోరినట్లు మంత్రి చెప్పారు. రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకోకముందు, తీసుకున్న తర్వాత ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉంటుందో చూపే అధ్యయన నివేదిక సమర్పించాలని.. ఈ ప్రాంతంలోనూ, ఇరుగు పొరుగు రాష్ట్రాల్లోనూ ఉన్న ఇదే తరహా ఎత్తిపోతల పథకాల స్థితిగతులతోపాటు, సదరు ప్రాజెక్టుల పర్యావరణ అనుమతుల వివరాలను వెల్లడిస్తూ నివేదిక ఇవ్వాలని అడిగినట్లు మంత్రి వెల్లడించారు.
ఇంతవరకూ సమర్పించలేదు..
రాయలసీమ ప్రాజెక్టు నిర్మాణం తర్వాత రిజర్వాయర్‌లో నీటిమట్టం తగ్గడంవల్ల ప్రభావితమయ్యే వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, రిజర్వ్‌డ్ ఫారెస్ట్ ఏరియా, ఇతర పర్యావరణ సున్నితమైన ఆవాస ప్రాంతాలు ఏమైనా ఉంటే.. ఆ వివరాలు సమర్పించాలని నిపుణుల మధింపు కమిటీ చెప్పినట్లు అశ్వినీకుమార్ చౌబే పేర్కొన్నారు. అయితే.. వీటిని ప్రాజెక్టు ప్రతిపాదకులు ఇంతవరకూ సమర్పించలేదని కేంద్ర మంత్రి వెల్లడించారు. రాయలసీమ ప్రాజెక్టు అనుమతుల గురించి చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి ఈమేరకు సమాధానమిచ్చారు.
వెలిగొండ డీపీఆర్ అందలేదు: షెకావత్
Union Minister Gajendra Singh Shekhawat on Veligonda project: వెలిగొండ ప్రాజెక్ట్‌కు సంబంధించి కృష్టా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ)కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇప్పటికీ డీపీఆర్ అందలేదని కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ వెల్లడించారు. టెక్నో-ఎకనమిక్ మదింపు కోసం వెలిగొండ ప్రాజెక్ట్ ప్రతిపాదన కూడా కేంద్ర జల సంఘానికి అందకపోవడంతో జల శక్తి మంత్రిత్వ శాఖ సలహా సంఘం వెలిగొండ ప్రాజెక్ట్‌ను ఆమోదించలేదని పేర్కొన్నారు.