AP LOAN: కాగ్ ఆడిట్ చేసిన లెక్కలు, ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం.. 2014-15 నుంచి 2021-22 వరకు ఆంధ్రప్రదేశ్ మొత్తం రూ.2,12,300.62 కోట్ల అప్పు చేసింది. ఇందులో రాష్ట్రం ఏర్పడిన తొలి ఐదేళ్లలో అప్పటి ప్రభుత్వం రూ.96,454 కోట్ల అప్పు చేస్తే... గడిచిన మూడేళ్లలో ప్రస్తుత ప్రభుత్వం రూ.1,15,846 కోట్లు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఆరోగ్యంపై భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు మంగళవారం రాజ్యసభలో కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి ఇచ్చిన సమాధానం ఈ విషయాన్ని వెల్లడించింది.
2014-15 (2014 జూన్ 2 నుంచి 2015 మార్చి 31వరకు)లో కాగ్ ఆడిట్ చేసిన రాష్ట్ర ఆర్థిక ఖాతాల ప్రకారం.. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ వాటా కింద రూ.97,123.93 కోట్ల రుణాన్ని కేటాయించారని చెప్పారు. ‘రాష్ట్ర బడ్జెట్‌కు అతీతంగా 2020-21, 2021-22, 2022-23ల్లో ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు స్పెషల్ పర్పస్ వెహికిల్స్, ఇతర సాధనాల ద్వారా రుణాలు తీసుకున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ అప్పుల అసలు, వడ్డీని రాష్ట్ర బడ్జెట్ నుంచిగానీ, పన్నులు, సెస్సులు, రాష్ట్ర ఇతర ఆదాయాలనుగానీ ఎసైన్ చేసి చెల్లించనున్నట్లు చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌తో సహా కొన్ని రాష్ట్రాలు ఇలాంటి రుణాల ద్వారా కేంద్రం విధించిన నికర రుణ పరిమితిని అతిక్రమిస్తున్నాయని, ఇలా చెల్లించే అప్పులన్నింటినీ ఆర్టికల్ 293(3) కింద రాష్ట్ర అప్పుల కిందే పరిగణిస్తామని చెప్పాం. ఆంధ్రప్రదేశ్‌తో సహా అన్ని రాష్ట్రాలూ ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాలు చేశాయి. రాష్ట్రం ఈ చట్టానికి కట్టుబడి ఉన్నదీ లేనిది సంబంధిత శాసనసభలే పర్యవేక్షిస్తాయి. ఏపీ ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం 2005 ప్రకారం రెవెన్యూ లోటును పరిహరించి, ఆర్థిక లోటును తగ్గించుకుని, ఆర్థిక సుస్థిరత, కార్యకలాపాల నిర్వహణలో పారదర్శకత పాటిస్తూ రుణాలను వివేకవంతంగా నిర్వహించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. ఆర్టికల్ 293(3) కింద రాష్ట్ర ప్రభుత్వాలకు నికర రుణ పరిమితి విధించే ముందు కేంద్ర ఆర్థికశాఖ సాధారణంగా ఆర్థిక సంఘం సిఫార్సులను దృష్టిలో ఉంచుకుంటుంది’ అని పంకజ్ చౌధరి వివరించారు.