కాకతీయ మెడికల్ కాలేజీలో 120 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సందర్శించారు. అత్యాధునిక వైద్య సదుపాయాలకు సంబంధించిన వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆపరేషన్ థియేటర్లు, అత్యాధునిక యంత్రాలను కేంద్రమంత్రి పరిశీలించారు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యంగా కేంద్రం 2014లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం చేపట్టిందన్నారు. వరంగల్ కేఎంసీకి 120 కోట్లు కేటాయించగా.. రాష్ట్రం నిధులు ఇవ్వకపోవడం వల్ల ప్రారంభోత్సవంలో జాప్యం జరుగుతోందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. తక్షణమే హాస్పిటల్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. వైద్యులు, ఇతర సిబ్బంది నియమాకం చేపట్టాలన్నారు.
నిధులు ఇవ్వకపోవడమే...
అత్యాధునిక సదుపాయాలు సమకూర్చినా.. పేదలకు ఆసుపత్రి అందుబాటులోకి రాలేదని కిషన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు ఇవ్వకపోవడమే కాకుండా కనీసం సిబ్బంది నియామకంపైనా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టలేదని ఆరోపించారు.
తప్పుడు ప్రచారాలు మానుకోవాలి
వరంగల్ పర్యటనలో భాగంగా జనగామలో కాసేపు ఆగిన కిషన్‌రెడ్డి కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలపై విపక్షాలు తప్పుడు ప్రచారం మానుకోవాలని సూచించారు. అనంతరం వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన కేంద్రమంత్రికి.. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కేంద్రమంత్రి అయిన తర్వాత అమ్మవారి దర్శనానికి రావాలని అనుకున్నా... కరోనా తదితర కారణాల వల్ల వీలుకాలేదన్నారు.
అధికారులతో సమీక్ష
అమ్మవారి దర్శనం అనంతరం.. ఆలయ పరిసరాల్లో సుందరంగా నిర్మితమవుతన్న భద్రకాళి బండ్‌ను కిషన్‌రెడ్డి సందర్శించారు. హృదయ్, స్మార్ట్ సిటీ పథకంలోలో భాగంగా 27 కోట్ల రూపాయల వ్యయంతో.. బండ్ నిర్మాణం చేపట్టారు. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్ధ ఆధ్వర్యంలో ఇప్పటివరకు జరిగిన పనులు... ఇంకా చేపట్టాల్సిన వాటిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అగలయ్య గుట్టపైన జైన మందిర నిర్మాణాలనూ పరిశీలించారు. సర్క్యూట్ అతిథి గృహంలో స్మార్ట్ సిటీ, అమృత్ పథకాల అమలు, కాజీపేట రైల్వే వంతెన పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఇదీ చూడండి:
దివీస్ విషయంలో కన్నబాబు ఆరోపణలు అవాస్తవం: చినరాజప్ప