కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రిగా పదోన్నతి పొందిన కిషన్ రెడ్డి తొలిసారి తెలంగాణకు విచ్చేస్తున్నారు. దిల్లీ నుంచి నేరుగా ఏపీలో తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఈ నెల 19న కోదాడకు రానున్నారు. కోదాడలో కిషన్ రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. కేంద్ర ప్రభుత్వం, జాతీయ నాయకత్వం సూచన మేరకు కోదాడ నుంచి కిషన్ రెడ్డిజన ఆశీర్వాద యాత్ర చేపట్టనున్నారు. పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ- అభివృద్ధి అంశాలను ఈ యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ఆగస్టు 19 సాయంత్రం 4 గంటలకు కోదాడలో జన ఆశీర్వాద యాత్ర ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి సూర్యాపేట చేరుకుని రాత్రి అక్కడే బస చేయనుంది.
వరంగల్, జనగామ, యాదాద్రి జిల్లాల్లో...
జన ఆశీర్వాద యాత్రలో భాగంగా 20వ తేదీ ఉదయం దంతాలపల్లి, తొర్రూరు, రాయపర్తి, వర్ధన్నపేట మీదుగా కిషన్ రెడ్డి వరంగల్ చేరుకుంటారు. అక్కడ భద్రకాళీ మాత దర్శనం చేసుకుంటారు. వరంగల్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వ్యాక్సినేషన్ సెంటర్ను కిషన్ రెడ్డి సందర్శిస్తారు. అక్కడి నుంచి నేరుగా హన్మకొండకు బయల్థేరి తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పించనున్నారు. హన్మకొండ నుంచి జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిల్లాషాపూర్కు వెళ్లి సర్వాయి పాపన్న కోటను పరిశీలిస్తారు. అక్కడి నుంచి జనగామ మీదుగా యాత్ర ఆలేరుకు చేరుకుంటుంది. ఆలేరులో పద్మశ్రీ అవార్డు గ్రహీత, చేనేత కళాకారులు చింతకింది మల్లేశంను కిషన్ రెడ్డి కలవనున్నారు. అనంతరం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని దర్శనానంతరం రాత్రి అక్కడే బస చేయనున్నారు.