తెలంగాణలో ప్రజాస్వామ్య, నీతివంతమైన పాలన రావాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) అభిప్రాయపడ్డారు. త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో యువతకు అన్యాయం జరుగుతోందని అన్నారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు వ్యతిరేకంగా కుటుంబ పాలన తీసుకొచ్చారని విమర్శించారు. బంగారు తెలంగాణ కాదు... అప్పుల రాష్ట్రంగా మార్చారని అన్నారు. కల్వకుంట్ల కుటుంబమే బంగారు కుటుంబంగా మారిందని ఆక్షేపించారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి రాబోతుందని అన్నారు. వేల కోట్ల రూపాయల ప్రజా సంపద దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. కేవలం రెండు కుటుంబాలే రాష్ట్రాన్ని శాసిస్తున్నాయని భాజపా (BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) చేపట్టిన ప్రజాసంగ్రామయాత్ర సందర్భంగా కేంద్రమంత్రి విమర్శించారు.
బీసీలకు అన్యాయం
అధికారంలోకి వచ్చాక హైదరాబాద్‌ను ఎంతో అభివృద్ధి చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ (cm kcr)... ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతారో లేదో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. పాతబస్తీకి మెట్రో రాకుండా ఎంఐఎం అడ్డుకుంటోందన్న కిషన్‌రెడ్డి... మెట్రో సేవలు రాకుండా పాతబస్తీకి కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. తెరాస ప్రభుత్వం బీసీలకు(bc) వెన్నుపోటు పొడుస్తోందని ఆరోపించారు. జనాభా ప్రాతిపదికన ఎందుకు రిజర్వేషన్లు(reservations) కల్పించట్లేదని ప్రశ్నించారు. నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాస ప్రభుత్వం వచ్చాక ఒక్క టీచరు పోస్టు కూడా భర్తీ చేయలేదని పేర్కొన్నారు.