కేంద్ర పర్యాటకశాఖ మంత్రిగా హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో ఈ రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతానని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. పర్యాటక రంగానికి జవసత్వాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక మార్పులను చేస్తుందని స్పష్టం చేశారు. నరేంద్రమోదీ సర్కారులో కేబినెట్ మంత్రిగా పదోన్నతి వస్తుందని ఊహించలేదని.. మూడు శాఖలు ఇచ్చి పెద్ద బాధ్యత మోపారు. వాటిని ప్రధాని ఆకాంక్షలకు అనుగుణంగా సమర్థంగా నిర్వహిస్తానని.. తెలుగువారు గర్వపడేలా పనిచేస్తానని కిషన్‌రెడ్డి అన్నారు. కేంద్రమంత్రిగా పూర్తిస్థాయిలో బాధ్యతలు నిర్వర్తిస్తూనే, రాష్ట్రంలో భాజపా బలోపేతం కోసం గట్టి కృషి చేస్తానని స్పష్టంచేశారు.
- కేబినెట్ మంత్రిగా పదోన్నతి లభిస్తుందని ముందే ఊహించారా?
ప్రధాని మోదీ కేబినెట్‌లో పదోన్నతి వస్తుందని అనుకోలేదు. ఏకంగా మూడు శాఖలు.. అవీ ప్రధానమైనవి అప్పగించడంతో నాపై బాధ్యత మరింత పెరిగింది. ఈశాన్య రాష్ట్రాలకు రూ. 68,000 కోట్ల భారీ బడ్జెట్ ఉంది. దేశంలో ఇతర రాష్ట్రాలతో సమానంగా అక్కడ అభివృద్ధి జరిగేలా చూడాలి. కేంద్రం తమను నిర్లక్ష్యం చేయట్లేదని, తమ అభివృద్ధిని కాంక్షిస్తుందన్న నమ్మకం వారిలో కల్పించడం.. తుపాకులతో హింసకు పాల్పడేవారిని ఆ మార్గానికి దూరం చేయడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖను ఏర్పాటు చేసింది.
ఇదీచూడండి:KISHAN REDDY: 'ఈ పదవి.. కార్యకర్తలకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నా'
- రెండేళ్లలోనే కేబినెట్ మంత్రిగా పదోన్నతికి ఏమిటి కారణాలు?
ఆ విషయం ప్రధానమంత్రి మోదీకే తెలుసు. నేను ఇతర సహాయ మంత్రుల కంటే గొప్పవాడినేం కాదు. పార్టీ పెద్దలు, ప్రధాని, అమిత్‌షా ఆలోచించి నిర్ణయించారు. అమిత్‌షా దగ్గర పనిచేయడం మంచి అనుభవం. నాకు అప్పగించిన బాధ్యతలను కష్టపడి నిర్వర్తించా. నాపై నమ్మకంతో హోంశాఖకు సంబంధించిన కీలక అంశాలను అప్పగించారు. ఆ శాఖలో మరింతకాలం పనిచేయాలని మనసులో ఉండేది. అనుకోకుండా పదోన్నతి వచ్చింది. 3 శాఖలు రావడం.. వ్యక్తిగతంగా సవాలే. ఆ శాఖల పరిధిలోని ఐదుగురు సహాయమంత్రుల సహకారంతో సమర్థంగా పనిచేసి ప్రధాని దగ్గర, ప్రజల్లో పేరు తెచ్చుకుంటా.
ఇదీచూడండి:Kishan Reddy: సామాన్య కార్యకర్త నుంచి కేంద్రమంత్రి దాకా... కిషన్‌రెడ్డి ప్రస్థానం
- పర్యాటక శాఖ బాధ్యతలు చేపట్టారు కదా.. కరోనాతో తీవ్రంగా నష్టపోయిన ఈ రంగాన్ని ఏ విధంగా ఆదుకోబోతున్నారు?
ట్యాక్సీలు.. హోటళ్లు.. గైడ్లు.. ఇలా ఎంతోమంది ఆధారపడిన ఈ రంగం తీవ్రంగా దెబ్బతిన్న విషయం యథార్థమే. పర్యాటకం ప్రధానమంత్రికి ఇష్టమైన రంగం. ఈ రంగానికి మంచిరోజులు తీసుకురావడం కోసం ఆలోచిస్తున్నారు. దీనిపై ఇప్పటికే వేసిన మంత్రుల సబ్‌కమిటీకి నేను కన్వీనర్‌గా పనిచేశా. కరోనా తగ్గగానే.. దేశ ప్రజల కోసం ‘భారత్ అంతా చూడండి’ అనే కార్యక్రమం చేపడతాం. ఈ రంగానికి జవసత్వాలు కల్పించడంతో పాటు.. కొవిడ్‌కు ముందుకంటే ఎక్కువగా పర్యాటకాన్ని పరుగులు పెట్టించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల సహకారమూ తీసుకుంటాం.
- కృష్ణా జలాల వివాద పరిష్కారం విషయంలో కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న విమర్శలు.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రాస్తున్న వరుస లేఖలపై మీరేమంటారు?