రాష్ట్రంలోని విమానాశ్రయాల్లో అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమి పరంగా, ఇతరత్రా విషయాల్లో చేయూత అందించాలని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం లేఖ రాశారు.
'రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు విమానాశ్రయాలకు కొంత భూమి ఇచ్చింది. కానీ తిరుపతిలో రన్‌వే విస్తరణ, ఇతర నిర్వహణ అవసరాల కోసం 14.31 ఎకరాల భూమి అవసరం. రాజమహేంద్రవరం విమానాశ్రయంలో నివాస కాలనీ నిర్మాణానికి 10.25 ఎకరాలు కావాలి. కడపలో రన్‌వే విస్తరణ, అప్రోచ్ లైనింగ్ సిస్టం కోసం 50 ఎకరాలు అవసరం. ఇవేవీ రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అందించలేదు. ఇంకా, విజయవాడ రన్‌వేను 4వేల మీటర్ల వరకు విస్తరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏలూరు కాలువను మళ్లించాలి. ప్రాంతీయ విమాన అనుసంధాన పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా రూ.14.64 కోట్లను రీజినల్ ఎయిర్ కనెక్టివిటీ ట్రస్టుకు జమ చేయాలి. జులై 31 వరకు ఉడాన్ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం వీజీఎఫ్ వాటాగా 20% చెల్లించాలి. ఉడాన్ పథకంలో విశాఖపట్నం - దుబాయి మధ్య అంతర్జాతీయ విమానాలు నడపడానికి రాష్ట్ర ప్రభుత్వం వీజీఎఫ్ కింద 100% మొత్తాన్ని సమకూరిస్తే ఈ మార్గాన్ని ఎయిర్‌లైన్స్ కోసం బిడ్డింగ్‌కు పెడతాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమ్మతి రాగానే ఈ ప్రయత్నం ప్రారంభిస్తాం' అని జ్యోతిరాదిత్య సింధియా తన లేఖలో పేర్కొన్నారు.