Parlament: రాష్ట్రంలో పంచాయతీ నిధుల దుర్వినియోగం, మళ్లింపు పెరుగుతున్నాయని కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ చెప్పారు. బుధవారం రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ‘‘2019-20 ఆడిట్ నివేదికలో పొందుపరిచిన దాదాపు లక్ష పరిశీలనల్లో (అబ్జర్వేషన్స్) 0.57% (570)ని దుర్వినియోగం లేదా మళ్లింపునకు సంబంధించినవిగా వర్గీకరించారు. అలాగే 2020-21కి సంబంధించి మొత్తం 3.57 లక్షల పరిశీలనలు రికార్డు చేయగా, అందులో 0.95% (3,391.5)ని దుర్వినియోగం లేదా మళ్లింపునకు సంబంధించినవిగా గుర్తించారు.
స్థానిక సంస్థలు కేంద్ర ఆర్థిక సంఘాల నిధులు వినియోగించే విషయంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని తేవడానికి కేంద్ర శాఖ ఆడిట్ ఆన్‌లైన్ పేరుతో ఒక అప్లికేషన్‌ను ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీలు 2019-20 సంవత్సరంలో 4,088 (31%), 2020-21లో 14,034 (100%) ఆడిట్ రికార్డులు సిద్ధంచేశాయి. పంచాయతీల కోసం విడుదల చేసిన నిధులను వాటి ఖాతాల నుంచి మళ్లించలేదని ఏపీ ప్రభుత్వం చెప్పింది’’ అని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ వెల్లడించారు.