ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పోలవరం పునరావాస పనులు ఏపీవే : కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ - కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ తాజా వార్తలు

పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితుల కోసం సహాయ, పునరావాస కార్యక్రమాలను ఏపీ ప్రభుత్వమే అమలు చేస్తోందని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ తెలిపారు. ముంపు బాధితుల్లోని ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు అదనపు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీని అమలు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ చెప్పిందన్నారు.

Union Minister
Union Minister

By

Published : Aug 3, 2021, 8:44 AM IST

పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితుల కోసం సహాయ, పునరావాస కార్యక్రమాలను ఏపీ ప్రభుత్వమే అమలు చేస్తోందని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ తెలిపారు. ముంపు బాధితుల్లోని ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు అదనపు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీని అమలు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ చెప్పిందన్నారు. అందులో 2013 పునరావాస చట్టం ప్రకారం ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.50వేల గ్రాంట్‌తోపాటు, వారు కోల్పోయిన భూమికి సమానమైన భూమిగానీ, లేదంటే రెండున్నర ఎకరాలనుగానీ ఇందులో ఏది తక్కువైతే అది ఇస్తున్నారు. వీటికి అదనంగా ఏపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల ప్యాకేజీ మంజూరు చేసిందన్నారు.

ఈ అంశంపై తెదేపా సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ సోమవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి ఈ మేరకు సమాధానమిచ్చారు. ఈ సహాయ, పునరావాస కార్యక్రమాల పర్యవేక్షణకు కేంద్రంలో ఏదైనా యంత్రాంగం ఉందా? అన్న ప్రశ్నకు బదులిస్తూ ‘‘సహాయ, పునరావాసాల బాధ్యత రాష్ట్రానిదే. దీని అమలు పరిశీలనకు కేంద్ర ప్రభుత్వ గిరిజన వ్యవహారాల కార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. ఇప్పటివరకు ఈ కమిటీకి వచ్చిన ఫిర్యాదులన్నింటినీ నమోదుచేసింది. వాటి పరిష్కారానికి సరైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేశాం’’ అని వివరించారు.

కనకమేడల: ముంపు ప్రాంతాల్లో రెండు లక్షల మంది ఆదివాసీ బాధితులకు రూ.30 వేలకోట్లకుపైగా పరిహారం చెల్లించాల్సి ఉంది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగా లేవు. బాధితులకు సరైన సౌకర్యాలు కల్పించడంలేదు. దీనిపై రాష్ట్రానికి అధికారుల బృందాలను పంపి పరిశీలించే అవకాశముందా?

మంత్రి:ముంపు బాధితులకు అవసరమైన సౌకర్యాలను కల్పించలేదని సభ్యుడు చెబుతున్నారు. కానీ... మందిరాలూ, పూజా స్థలాలు, పాఠశాల భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, కమ్యూనిటీ హాళ్లు, పంచాయతీ భవనాలు, పీహెచ్‌సీ, వెంటర్నరీ ఆసుపత్రి, జీసీసీ స్టోర్‌, షాపింగ్‌ కాంప్లెక్స్‌, పోస్టాఫీస్‌, బస్‌షెల్టర్‌, ఎరువుల దుకాణం, గ్రంథాలయం, డంపింగ్‌ యార్డుల నిర్మాణాలు పునరావాస ప్రాంతాల్లో జరిగాయి.

జీవీఎల్‌ నరసింహారావు:ఈ ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.11వేల కోట్లకుపైగా విడుదల చేసినందుకు ప్రధానికి ధన్యవాదాలు చెబుతున్నా. ముంపు బాధితులకు రాష్ట్రం నుంచి కొన్ని సమస్యలు ఎదురవుతున్నట్లు ఇటీవల మా పార్టీ నాయకులు గుర్తించారు. అందువల్ల మంత్రి సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించాలి. అలాగే పోలవరం ప్రాజెక్టు అథారిటీని హైదరాబాద్‌ నుంచి రాజమండ్రికి తరలించాలి.

మంత్రి:పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడంతోపాటు, నిర్మాణాన్ని వేగంగా సాగించేందుకు రాష్ట్రం నుంచి వస్తున్న బిల్లులను వెన్వెంటనే చెల్లిస్తున్నాం. ప్రాజెక్టు అథారిటీ తరలింపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం. పార్లమెంటు సమావేశాలు పూర్తయిన వెంటనే నేను పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తా.

సవరణ డీపీఆర్‌ పెండింగ్‌లో లేదు

పోలవరం సవరించిన సవివర ప్రాజెక్టు రిపోర్ట్‌ (రివైజ్డ్‌ డీపీఆర్‌) ఏదీ కేంద్రం వద్ద పెండింగ్‌లో లేదని గజేంద్రసింగ్‌ షెకావత్‌ స్పష్టంచేశారు. ‘పోలవరం ప్రాజెక్టు సవరించిన డీపీఆర్‌కు కేంద్రం ఇప్పటివరకూ ఆమోద ముద్ర వేయలేదన్నది నిజమేనా’ అని వైకాపా సభ్యుడు విజయసాయిరెడ్డి సోమవారం రాజ్యసభలో అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానమిచ్చారు. ‘‘పోలవరం డీపీఆర్‌ను ఇదివరకే జల్‌శక్తి పరిధిలోని అడ్వయిజరీ కమిటీ 2009 జనవరి 20న 2005-06 నాటి ధరల ప్రకారం రూ.10,151.04 కోట్లకు ఆమోదించింది. అనంతరం ప్రాజెక్టు డీపీఆర్‌ సవరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలనూ సమర్పించలేదు. అయినప్పటికీ ప్రాజెక్టు అంచనా వ్యయం సవరణకు అడ్వయిజరీ కమిటీ 2011, 2019లలో ఆమోదముద్ర వేసింది. మళ్లీ ఇప్పుడు కొత్తగా రివైజ్డ్‌ డీపీఆర్‌ను ఆమోదించడం అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు’ అని మంత్రి స్పష్టీకరించారు.

ఇదీ చదవండి: నేడు కృష్ణా, గోదావరి బోర్డుల సమన్వయ కమిటీ సమావేశం.. తెలంగాణ హాజరు అనుమానమే

ABOUT THE AUTHOR

...view details