ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: 'కాళేశ్వరం మూడో టీఎంసీ పనులు చేపట్టొద్దు'

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం సహా ఏడు ప్రాజెక్టులు... ఆంధ్రప్రదేశ్‌ చేపట్టిన పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులన్నీ కొత్తవేనని కేంద్రం తేల్చి చెప్పింది. గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సమర్పించి ఆమోదం పొందే వరకు ప్రాజెక్టుల విషయంలో ముందుకెళ్లొద్దని కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ.. తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి సూచించింది.

union-jal-shakti
union-jal-shakti

By

Published : Dec 14, 2020, 12:01 PM IST

కాళేశ్వరం మూడో టీఎం​సీ పనులు సహా ఏడు ప్రాజెక్టుల విషయంలో ముందుకెళ్లొద్దని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం మరోసారి సూచించింది. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ విషయంలోనూ ఇదే వర్తిస్తుందని తెలిపింది. ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్​కు కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ లేఖ రాశారు. ఈ నెల 11న దిల్లీలో కేంద్రమంత్రిని కేసీఆర్​ కలిసిన రోజే లేఖ రావడం గమనార్హం. కృష్ణా, గోదావరి బేసిన్లలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని ఎన్నోసార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని అక్టోబరు 2న కేంద్రానికి సీఎం కేసీఆర్​ లేఖ రాయగా... కేంద్రమంత్రి సమాధానమిచ్చారు.

ప్రభుత్వాలు ఇప్పటివరకు స్పందించలే

అక్టోబర్‌ 6న జరిగిన రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో తీసుకున్న నిర్ణయాలపై ఇరు ప్రభుత్వాలు ఇప్పటివరకు స్పందించలేదని షెకావత్‌ పేర్కొన్నారు. అక్టోబర్‌ 2న కేసీఆర్​ రాసిన లేఖలో ఒక్కొక్క అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఈనెల 11న ప్రత్యుత్తరం ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ పనులు, సీతారామ ఎత్తిపోతల పథకం, జీఎల్​ఐఎస్​ మూడో దశ, తుపాకుల గూడెం, రామప్ప పథకాలన్నీ కొత్తవేనని తెలిపింది.

షెకావత్‌ తన లేఖలో స్పష్టం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు కూడా కొత్తదేనని షెకావత్‌ తన లేఖలో స్పష్టం చేశారు. కొత్తవాటి డీపీఆర్​లు కేంద్రానికి సమర్పించి... అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే.. నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పు విషయాన్ని ఈ సందర్భంగా షెకావత్‌ ప్రస్తావించారు.

పనులు నిలిపివేయాలి

పోతిరెడ్డిపాడు నిర్మాణాన్ని కొత్త ప్రాజెక్టుగానే పరిగణిస్తున్నట్లు లేఖలో ప్రస్తావించిన షెకావత్.. పనులు నిలిపివేయాలని.. ఆగస్టు 7న తానే స్వయంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు పేర్కొన్నారు. కృష్ణా ట్రైబ్యునల్‌ 2010లో ఇచ్చిన తుది ఉత్తర్వులపై 2011లో సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని, ఈ వ్యవహారంపై 2015లో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయాన్ని కూడా షెకావత్‌ పేర్కొన్నారు.

అభిప్రాయాలు పంపగలిగితే

ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో తెలంగాణ చెప్పినట్లు గుర్తు చేశారు. దీనిపై ఇప్పటి వరకు ఎటువంటి చర్య తీసుకోలేదన్న షెకావత్‌.. కోర్టులో కేసు పెండింగ్‌ ఉన్నంత కాలం కృష్ణా ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పును కేంద్రం నోటిఫై చేయలేదని తేల్చి చెప్పారు. గోదావరి ట్రైబ్యునల్‌ ఏర్పాటుకు ఇరు ప్రభుత్వాలు ఇప్పటివరకు విజ్ఞప్తి పంపలేదని తెలిపారు. దీనిపై ఏపీ, తెలంగాణ తమ అభిప్రాయాలు పంపగలిగితే.. తదుపరి చర్యలు తీసుకోడానికి... కేంద్రం సిద్దంగా ఉన్నట్లు తెలిపారు.

కృష్ణా ట్రిబ్యునల్-3 ఏర్పాటుకు కేంద్రానికి ఎలాంటి అభ్యంతరం లేదని షెకావత్‌ స్పష్టం చేశారు. గోదావరి, కృష్ణాలో టెలిమీటర్ల వ్యయాన్ని ఇరు రాష్ట్రాలు భరిస్తే ఏర్పాటు చేస్తామని గతంలోనే చెప్పినట్లు కేంద్రమంత్రి గుర్తుచేశారు.


ఇదీ చూడండి :దేశంలో మరో 27,071 మందికి కరోనా

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details