ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సూపర్​ ఇన్ఫర్మేషన్ రహదారిగా NH 44.. ఇక ట్రాఫిక్‌ జామ్‌ అయితే ఇట్టే తెలిసిపోతుంది! - NH 44 news'

NH 44: హైదరాబాద్‌-బెంగళూరు హైవేని సూపర్​ అన్ఫర్మేషన్ రహదారిగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది. ఫలితంగా ఆ రహదారిపై పది కిలోమీటర్ల ముందు ట్రాఫిక్‌ జామ్‌ అయినా తెలిసిపోతుంది. ఆ ప్రాంతాన్ని దాటేందుకు ఎంత సమయం పడుతుందో... ప్రత్యామ్నాయాలు ఏమిటో.. ఎక్కడ పెట్రోలు బంకులు ఉన్నాయో కూడా తెలిసిపోతాయి.

hyderabad Bangalore highway
hyderabad Bangalore highway

By

Published : Jan 30, 2022, 4:35 PM IST

NH 44: హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్‌లో చిక్కుకు పోయారా? బయట పడేందుకు ఎంత సేపు పడుతుందో తెలియకుండా ఉందా? మున్ముందు అలాంటి ఆందోళన ఉండదు. పది కిలోమీటర్ల ముందు ట్రాఫిక్‌ జామ్‌ అయినా తెలిసిపోతుంది. ఆ ప్రాంతాన్ని దాటేందుకు ఎంత సమయం పడుతుందో... ప్రత్యామ్నాయాలు ఏమిటో.. ఎక్కడ పెట్రోలు బంకులు ఉన్నాయో... ఆసుపత్రి ఎంత దూరంలో ఉందో... ఇలాంటివన్నీ మార్గంలో ఎక్కడికక్కడ డిజిటల్‌ బోర్డులపై రియల్‌టైంలో కనిపిస్తుంటాయి. ఈ హైవేని సూపర్‌ ఇన్ఫర్మేషన్‌ రహదారిగా తీర్చిదిద్దాలని కేంద్రం నిర్ణయించింది. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ మీదుగా బెంగళూరు వెళ్లే ఈ 44వ నంబరు జాతీయ రహదారిని అత్యాధునికంగా మార్చేందుకు రూ.14,400 కోట్లు అవుతుందని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అంచనాలు రూపొందించింది. సవివర నివేదిక (డీటెయిల్డు ప్రాజెక్టు రిపోర్టు)ను సిద్ధం చేసేందుకు కన్సల్టెంటును సైతం ఎంపిక చేసింది. తాజాగా ఆ సంస్థతో జాతీయ రహదారుల సంస్థ ఒప్పందం చేసుకుంది. త్వరలో ఆ బృందం క్షేత్రస్థాయి పరిశీలనకు రానుంది. నివేదిక రూపొందించేందుకు తొమ్మిది నెలల వ్యవధి పడుతుందన్నది అంచనా. అవసరమైన భూమిని కూడా గతంలోనే సేకరించటంతో విస్తరణ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధిక సమయం పట్టదని మంత్రిత్వ శాఖ అధికారులు భావిస్తున్నారు.

ప్రస్తుతం నాలుగు వరుసలు ఉండగా ఆరు వరుసలకు విస్తరిస్తారు. రహదారికి ఇరువైపులా ఏడేసి మీటర్ల వెడల్పున సర్వీసు రోడ్లను కూడా నిర్మించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ట్రాఫిక్‌ జామ్‌లు అవుతున్నాయి. ఈ పరిస్థితులను అధిగమించేందుకు విస్తరణ చేయాలన్న ప్రతిపాదనలు కొన్నేళ్లుగా నలుగుతున్నాయి. తాజాగా ప్రభుత్వం ఈ మార్గం విస్తరణకు ఆమోదముద్ర వేసింది. హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు వరకు రూ.4,750 కోట్లు అవుతుందన్నది ప్రాథమిక అంచనా.

ప్రయోగాత్మకంగా దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌ హైవేలో..
హైదరాబాద్‌-బెంగళూరు రహదారి అంతటినీ పూర్తి స్థాయిలో రియల్‌ టైమ్‌ డిజిటల్‌ వ్యవస్థతో అనుసంధానం చేయనుండగా తొలుత ప్రయోగాత్మకంగా దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌ హైవేలోని కొన్ని ప్రాంతాల్లో చేపట్టేందుకు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది. ఈ మార్గం నిర్మాణం తుది దశలో ఉంది. రియల్‌ టైమ్‌ డిజిటల్‌ వ్యవస్థతో అనుసంధానం చేయగానే జాతీయ రహదారుల సంస్థకు చెందిన ఓ విభాగం ఆయా వ్యవహారాలను పర్యవేక్షిస్తుంటుంది. అన్ని టోల్‌ప్లాజాల వద్ద ఇందుకు సంబంధించిన వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ వ్యూహంగా ఉంది.

ఎంతెంత దూరం అంటే..

  • హైదరాబాద్‌ నుంచి బెంగళూరు దూరం - 576 కిలోమీటర్లు
  • హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు వరకు - 210 కిమీ
  • ఆంధ్రప్రదేశ్‌ నుంచి కర్ణాటక సరిహద్దుకు - 260 కిమీ
  • కర్ణాటక సరిహద్దు నుంచి బెంగళూరు నగర సరిహద్దు వరకు - 106 కిమీ

ఇదీచూడండి:MPs to Rajya sabha from Andhra Pradesh : రాజ్యసభకు వైకాపా నుంచి ఆ నలుగురు!

ABOUT THE AUTHOR

...view details