ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

BJP ZONAL MEETING: జగన్‌ చెప్పేదొకటి.. చేసేదొకటి: కేంద్ర మంత్రి మురుగన్​

BJP ZONAL MEETING: దేశంలో భాజపా మాత్రమే సిద్ధాంత పార్టీ అని, దేశ వికాసమే తమ పార్టీ ఏకైక లక్ష్యమని కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి మురుగన్‌ అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు మద్యపాన నిషేధం అని చెప్పి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటింటికి సారా పంచుతున్నారని విమర్శించారు. ఏపీలో వైకాపా, తెదేపా, తెలంగాణలో తెరాస, తమిళనాడులో డీఎంకే కుటుంబ పార్టీలని ఎద్దేవా చేశారు.

union assistant minister of information murugan
సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి మురుగన్‌

By

Published : May 1, 2022, 7:29 AM IST

BJP ZONAL MEETING: జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు మద్యపాన నిషేధం అని చెప్పి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటింటికి సారా పంచుతున్నారని కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి మురుగన్‌ విమర్శించారు. అనంతపురంలో శనివారం జరిగిన భాజపా రాయలసీమ జోనల్‌ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఏపీలో వైకాపా, తెదేపా, తెలంగాణలో తెరాస, తమిళనాడులో డీఎంకే కుటుంబ పార్టీలని పేర్కొన్నారు. దేశంలో భాజపా మాత్రమే సిద్ధాంత పార్టీ అని అన్నారు. దేశ వికాసమే తమ పార్టీ ఏకైక లక్ష్యమన్నారు. ప్రధాని నరేంద్రమోదీ చెప్పిందే చేస్తారని తెలిపారు. ఆర్టికల్‌ 370 రద్దు, రామమందిరం, త్రిబుల్‌ తలాక్‌, సీఏఏ వంటివి ఎన్నికల ముందే ప్రకటించామని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని సాధించినట్లు వివరించారు. ఎనిమిదేళ్ల భాజపా పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ లేకపోవడం పారదర్శక పాలనకు నిదర్శనమన్నారు. నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్‌గాంధీ, కరుణానిధి వంటి వారికి దేశంలో స్మారకాలు ఉన్నాయి. భారతీయులకు రాజ్యాంగాన్ని అందించిన అంబేడ్కర్‌కు ఒక్క స్మారకం లేకపోవడం గత పాలకుల చిత్తశుద్ధిని తెలియజేస్తోందన్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేడ్కర్‌ 125వ జయంతిని ఏడాది పాటు నిర్వహించారని తెలిపారు. ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగ అధికారం కల్పించిన ఘనత మోదీకి దక్కుతుందన్నారు.

రాయలసీమ అభివృద్ధిపై వైకాపాకు చిత్తశుద్ధి లేదు: రాష్ట్రంలో ఇంటింటికీ తాగునీరు అందించేందుకు కేంద్రం రూ.4,300 కోట్లు మంజూరు చేస్తే వైకాపా ప్రభుత్వం కనీసం రూ.400 కోట్లు ఖర్చు చేయలేదని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ ఆరోపించారు. ఏపీలో 21 లక్షల ఇళ్ల నిర్మాణానికి రూ.29 వేల కోట్లు కేటాయించగా.. మంజూరు చేసిన గృహాలను కూడా నిర్మించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. పులివెందుల నియోజకవర్గానికి 18 వేల ఇళ్లు మంజూరు చేస్తే ఇప్పటివరకు 870 మాత్రమే పూర్తయ్యాయన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మట్టి, మైనింగ్‌, భూకబ్జాలపై ఉన్న శ్రద్ధ పుంగనూరులో పేదల ఇళ్ల నిర్మాణంపై లేదన్నారు. రాయలసీమ అభివృద్ధిపై వైకాపాకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర బాధ్యుడు సునీల్‌ దేవధర్‌, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: వైకాపాలో వర్గపోరు ... కొట్లాటల నుంచి హత్యల వరకు..

ABOUT THE AUTHOR

...view details