ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొలువులు కలే, అమలుకాని జాబ్‌ క్యాలెండర్‌ షెడ్యూలు - unexecuted job calendar schedules

JOB CALENDAR పిల్లల కోసం ఉద్యోగాల విప్లవం తీసుకురాబోతున్నాం, అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తాం ఇది ప్రతిపక్ష నేతగా జగన్‌ ఇచ్చిన వాగ్దానం. ఏళ్ల తరబడి నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తూ యువత మనోధైర్యం కోల్పోతున్నారు ఈ పరిస్థితిని మారుస్తున్నాం ఇది సీఎంగా జగన్‌ చెప్పిన మాట. కానీ ఈ ప్రకటనలన్నీ ఉత్తుత్తీగానే మిగిలిపోతున్నాయి. యువతకు సర్కారు కొలువులు కలగానే ఉండిపోతున్నాయి. జాబ్‌ క్యాలెండర్‌ షెడ్యూల్‌ను అమలు చేయక, నోటిఫికేషన్లు విడుదల కాక నిరుద్యోగులు ఏజ్‌ బార్ అయిపోతున్నారు.

JOB CALENDAR
JOB CALENDAR

By

Published : Aug 22, 2022, 8:35 AM IST

JOB CALENDAR : ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుమారు 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన జగన్‌.. తర్వాత ముఖ్యమంత్రి అయ్యాక జాబ్‌ క్యాలెండర్‌ కూడా ప్రకటించడంతో యువతలో ఆశలు చిగురించాయి. ఏపీపీఎస్సీ, పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు, డీఎస్సీ తదితరాల ద్వారా భారీగా నోటిఫికేషన్లు వస్తాయని భావించి ఉద్యోగాలకు సిద్ధమైన వారిని నేడు నిరాశ నిస్పృహలు ఆవహించాయి. పలు సందర్భాల్లో, సమీక్షల్లో ముఖ్యమంత్రి చెప్పిన ప్రకారమైతే.. గతేడాది జులై నుంచి ఈ ఏడాది మార్చి వరకు వరుస నోటిఫికేషన్లు వెలువడి ఉండాలి. 2021 జూన్‌లో మొత్తం 10,143 పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

ఇందులో వివిధ శాఖల్లోని బ్యాక్‌లాగ్‌ వేకెన్సీలు 1,238, వైద్య ఆరోగ్య శాఖకు చెందిన 6,143 పోస్టుల భర్తీలో మాత్రమే పురోగతి ఉంది. లక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్న గ్రూపు-1, 2, పోలీసు, అధ్యాపక, ఆచార్యుల పోస్టుల భర్తీపై ఊసెత్తడం లేదు. 2021 జూన్‌లో ఇచ్చిన గ్రూపు-1, 2 నోటిఫికేషన్‌లో కేవలం 36 పోస్టులు భర్తీ చేస్తున్నట్లు ప్రకటించడంతో యువత నుంచి ఆందోళనలు వెల్లువెత్తాయి మళ్లీ 2022 మార్చి 31న ఇచ్చిన నోటిఫికేషన్‌లో గ్రూపు-1లో పోస్టులను 31 నుంచి 110కి, గ్రూపు-2లో 25 నుంచి 182కు పెంచారు. వీటి భర్తీ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం 450 పోలీసు కానిస్టేబుల్‌, ఎస్సై, ఇతర కేటగిరీల్లోని పోస్టులు నింపుతామని చెప్పినా, నోటిఫికేషన్‌ రాలేదు. రాష్ట్ర పోలీసు శాఖలో 14,613 ఖాళీలు ఉండగా, కానిస్టేబుల్‌ ఉద్యోగాలే 12,182 వరకు ఉన్నట్లు బీపీఆర్‌డీ నివేదిక-2021లో వెల్లడించింది.

ప్రతిపక్ష నేత హోదాలో..

పిల్లల కోసం ఉద్యోగాల విప్లవం తీసుకురాబోతున్నాం. రాష్ట్రం విడిపోయే నాటికి 1.42 లక్షల ఖాళీలున్నాయి. ఆ ఉద్యోగాలకు సిద్ధమయ్యేందుకు యువత కోచింగ్‌ సెంటర్లకు వెళ్తూ వేలకు వేలు ఖర్చు చేస్తున్నారు. మనం అధికారంలోకి రాగానే చేయబోయే మొట్టమొదటి పని.. నాలుగున్నరేళ్లుగా ఖాళీగా ఉన్న 1.42 లక్షల ఉద్యోగాలతో పాటు పదవీ విరమణ ద్వారా ఏర్పడే మరో రెండు లక్షల ఖాళీలను ఎప్పటికప్పుడు ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని మాట ఇస్తున్నా.

ముఖ్యమంత్రి హోదాలో..

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌పై స్పష్టత లేక ఏళ్ల తరబడి ఎదురుచూస్తూ యువత మనోధైర్యం కోల్పోతున్నారు. ఈ పరిస్థితిని మారుస్తున్నాం. రాబోయే 9 నెలల్లో అంటే.. 2021 జులై నుంచి 2022 మార్చి వరకు ఏ నెలలో ఏయే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ ఇస్తామో వివరిస్తూ జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తున్నాం.

- 2021 జూన్‌ 18న జగన్‌ ప్రకటన

నోటిఫికేషన్లతోనే సరి!

కొత్తగా నోటిఫికేషన్లు ఇస్తే గ్రూప్‌-1కు రెండు లక్షలు, గ్రూప్‌-2కు ఐదు లక్షలు, పోలీసు ఉద్యోగాలకు ఐదు లక్షల మంది దరఖాస్తు చేసే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఉన్నత విద్యాశాఖ తరపున ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 240 లెక్చరర్‌ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ గత జనవరిలోనే ప్రకటన ఇవ్వాల్సి ఉన్నా, ఇప్పటికీ అతీగతీ లేదు. విశ్వవిద్యాలయాల్లో 2,000 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ఫిబ్రవరిలో ప్రకటన ఇస్తామని చెప్పినప్పటికీ, ఇవ్వలేదు. పోస్టుల భర్తీకి జీవోలు ఇచ్చిన వెంటనే సంబంధిత శాఖలు ఖాళీల ప్రకారం రిజర్వేషన్ల వారీగా ఏపీపీఎస్సీకి వివరాలు పంపాలి. తర్వాత ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు ఇవ్వాలి. అయితే, శాఖల మధ్య సమన్వయం లోపిస్తోంది. నోటిఫికేషన్లలో జారీలో జాప్యమయ్యే కొద్దీ వయోపరిమితి దాటి ఎందరో నిరుద్యోగులు అనర్హులుగా మిగిలిపోతున్నారు. మరోపక్క, ఆయుర్వేద, యునాని, హోమియో వైద్యులు, సర్వే శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌, అసిస్టెంట్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌, ఇతర పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు ఇచ్చింది. వీటికి దరఖాస్తుల స్వీకరణ పూర్తయినా, కొన్నింటికి రాతపరీక్షలు జరగలేదు. మరికొన్నింటికి పరీక్షల తేదీలు ప్రకటించలేదు. వెరసి యువత ఉద్యోగాల్లో చేరలేదు. కొత్తగా గ్రామ/వార్డు సచివాలయాలు ఏర్పాటుచేసిన ప్రభుత్వం.. వాటిల్లో 1.20 లక్షల మందిని 12 కేటగిరీల్లో నియమించింది.

లక్షల్లో దరఖాస్తులు

ఏపీపీఎస్సీ ఇటీవల నిర్వహించిన గ్రూపు-4, దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, ఇంజినీరింగ్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షకు అభ్యర్థులు భారీగా దరఖాస్తులు చేసుకున్నారు. దేవాదాయ శాఖ పోస్టులకు 1,07,482, గ్రూపు-4 ఉద్యోగాలకు 3,86,195 అర్జీలు అందడం రాష్ట్రంలో నిరుద్యోగ తీవ్రతకు అద్దం పడుతోంది. అయితే, గ్రూపు-3, 4 పోస్టుల భర్తీకి నిర్వహించిన స్క్రీనింగ్‌ టెస్టుల ద్వారా 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ప్రధాన పరీక్షలు రాసేందుకు ఎంపిక చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు వస్తున్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details