ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జాబ్ క్యాలెండర్‌కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగుల నిరసన - Unemployment protest against job calendar

ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌(Job Calendar)కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు కదంతొక్కారు. కొలువుల సంఖ్య పెంచాలంటూ... కలెక్టరేట్లు, ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడికి యత్నించారు. చాలాచోట్ల విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఖాళీ పోస్టులను భర్తీ చేసేలా కొత్త జాబ్ క్యాలెండర్‌(Job Calendar) విడుదల చేయాలని.... ఈ నెల 30న జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Unemployment protest
జాబ్ క్యాలెండర్‌కు వ్యతిరేకంగా నిరుద్యోగుల నిరసన

By

Published : Jun 28, 2021, 10:28 PM IST

జాబ్ క్యాలెండర్‌కు వ్యతిరేకంగా నిరుద్యోగుల నిరసన

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌(Job Calendar)ను వ్యతిరేకిస్తూ... రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. బూటకపు ఉద్యోగ క్యాలెండర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ... కడపలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా నివాసం ఎదుట ఉద్యోగ సంఘాలు ఆందోళన చేపట్టాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న నిరసనకారులను... పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. జాబ్‌ క్యాలెండర్‌ను రీ కాల్ చేయాలని... లేదంటే ఈ నెల 30న అమరావతిని ముట్టడిస్తామని హెచ్చరించారు..

జాబ్ క్యాలెండర్‌(Job Calendar)ను నిరసిస్తూ... విద్యార్ధి సంఘాలు పిలుపునిచ్చిన ఛలో కలెక్టరేట్ గుంటూరులో అరెస్టులకు దారితీసింది. నిరసన తెలిపేందుకు వెళ్తున్న విద్యార్ధి సంఘాల నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఉద్యోగ సాధన సమితి ఆందోళనకు మద్దతిచ్చిన ఎమ్మెల్సీ(MLC) లక్ష్మణరావును లాలాపేట పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఏపీ ఉద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో విద్యార్థి యువజన సంఘాలు విజయవాడలో మహాధర్నా చేపట్టాయి. జాబ్ లెస్ క్యాలెండర్ వద్దు.... జాబ్‌లు ఉన్న క్యాలెండర్‌ కావాలంటూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.

తిరుపతిలోనూ ఏపీ ఉద్యోగ పోరాట సమితి ఆందోళన చేపట్టింది. మంత్రి పెద్దిరెడ్డి ఇంటిని ముట్టడించేందుకు యత్నించిన నిరుద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు. ఏలూరులో మంత్రి ఆళ్ల నాని ఇంటి ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. ఉద్యోగ సంఘాల నాయకులు చేపట్టిన ర్యాలీలో దెందులూరు మాజీ ఎమ్మెల్యే(Former MLA) చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. జగన్ పాదయాత్రలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందంటూ... అనంతపురంలో విద్యార్థి యువజన సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఇంటి ముట్టడికి వెళ్తుండగా పోలీసులు స్టేషన్‌కు తరలించారు. కర్నూలు జిల్లా నంద్యాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాల నాయకులు అర్ధ నగ్న ప్రదర్శన నిర్వహించారు. కొత్తగా జాబ్ క్యాలెండర్‌ విడుదల చేయాలంటూ... తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.

ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ... విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ నిరుద్యోగుల ఆందోళన కొనసాగింది. కొత్త జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు.

ఇదీ చదవండి:

Lokesh letter to cm jagan: 'నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే పోరాటం ఉద్ధృతం చేస్తాం'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details