Unemployes fire on state govt: ఉద్యోగాల ఖాళీల భర్తీలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు నిరుద్యోగులను ఆగ్రహానికి గురిచేస్తోంది. ఖాళీలు ఎక్కువగా ఉన్నా తక్కువ సంఖ్యలో పోస్టులను భర్తీ చేస్తుండటం పట్ల నిరుద్యోగులు మండిపడుతున్నారు. ముఖ్యంగా లక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూసే...గ్రూపు-1, గ్రూపు-2, పోలీసు, ఇతర ఉద్యోగాల నోటిఫికేషన్లు చాలా కాలం నుంచి వెలువడలేదు. గత ఏడాది జూన్ 18న జారీ చేసిన క్యాలెండర్‌లో గ్రూపు-1, 2 కింద కేవలం 36 పోస్టులు ప్రకటించారు.
ఇవి మరీ తక్కువగా ఉండడంతో నిరుద్యోగ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాయి. తర్జనభర్జనల అనంతరం శుక్రవారం గ్రూపు-1 కింద 110 పోస్టులు, గ్రూపు-2 కింద 182 పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా గ్రూపు-2 కింద ప్రకటించిన పోస్టులు తక్కువగా ఉండడం పట్ల నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2016లో గ్రూపు-1 కింద 74, గ్రూపు-2లో 980, 2018లో గ్రూపు-1 కింద 160, గ్రూపు-2లో 443 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. గ్రూపు-2 పోస్టులకు లక్షల్లో దరఖాస్తులు వస్తాయి. ఈ పోస్టుల కోసం నాలుగైదు సంవత్సరాల నుంచి సన్నద్ధమయ్యే నిరుద్యోగులు ఉన్నారు.
రాష్ట్ర సచివాలయంలో 250 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ల పోస్టులు ఖాళీగా ఉండగా.. కొన్ని పోస్టుల భర్తీకే అవకాశం కల్పించారు. ఇలాగే ఇతర శాఖల్లోనూ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 66,309 ఖాళీలు ఉన్నట్లు ప్రకటించింది. అన్ని శాఖల్లో కలిపి 7,71,177 పోస్టులు మంజూరు కాగా... 5,29,868 మంది శాశ్వత ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉపాధి కల్పనా కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకున్న నిరుద్యోగులు 6.16 లక్షల మంది ఉన్నారు. పోస్టుల సంఖ్యను పెంచాలని నిరుద్యోగ ఐకాస, ఉద్యోగ పోరాట సమితి నేతలు హేమంతకుమార్, సిద్ధిక్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.