ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నిషేధమున్నా అనధికార బదిలీలు... ఎక్కువగా చెక్‌పోస్టుల్లో పోస్టింగులు - ఏపీ రవాణా శాఖ తాజా వార్తలు

Unauthorized transfers: రవాణా శాఖలో నిషేధమున్నా అనధికార బదిలీలు కలవరపరుస్తున్నాయి. ఇందులో ఎక్కువగా చెక్‌పోస్టుల్లో పోస్టింగులు జరుగుతున్నాయి. ఇందుకు ఓడీల పేరిట కీలక అధికారి ఆదేశాలిచ్చిన వైనం ఆశ్చర్యపరుస్తోంది. పెద్ద ఎత్తున సొమ్ములు చేతులు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Unauthorized transfers
అనధికార బదిలీలు

By

Published : Sep 14, 2022, 7:41 AM IST

Unauthorized transfers: రవాణా శాఖలో అధికారులు, ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఉన్నా.. కొద్దిరోజులుగా పెద్దసంఖ్యలో అనధికార బదిలీలు జరిగిపోయాయి. ఆన్‌ డిప్యూటేషన్‌ (ఓడీ) పేరిట 20 మంది అధికారులకు ఆదేశాలిచ్చారు. నిత్యం రాబడి ఉండే చెక్‌పోస్టుల్లోకి ఎక్కువమంది వెళ్లారు. ఇలా పంపేందుకు పెద్దఎత్తున డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అన్ని శాఖల్లాగే రవాణా శాఖలో బదిలీలకు జూన్‌లో అప్పటి కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌ కసరత్తు చేశారు.

అధికార పార్టీ ముఖ్యనేతల సిఫార్సులనూ ఆయన పట్టించుకోకపోవడంతో.. జూన్‌ 28న ఆయన్ను బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఇన్‌ఛార్జ్‌ కమిషనర్‌గా రాజబాబును నియమించారు. ఆయన జూన్‌ 30లోపు బదిలీలు చేయలేనని, 15 రోజులు గడువు కావాలని ప్రభుత్వాన్ని కోరగా, అందుకు అనుమతించారు. ఈ మేరకు జులై 15కి బదిలీలు పూర్తిచేశారు. జులై 16 తర్వాత ఎవరిని బదిలీ చేయాలన్నా, డిప్యుటేషన్‌పై పంపాలన్నా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలనే ఉత్తర్వులు ఉన్నాయి. అయినా ప్రభుత్వ అనుమతి లేకుండా ఇప్పటివరకూ ఓడీల పేరిట బదిలీలు జరిగాయి.

చెక్‌పోస్టులకే అధిక డిమాండు:ఓడీలు పొందిన ఎంవీఐలు, ఏఎంవీఐలలో ఎక్కువమంది రాష్ట్ర సరిహద్దులోని, వివిధ రాష్ట్ర, జాతీయ రహదారులపై ఉన్న రవాణాశాఖ చెక్‌పోస్టులకు వెళ్లినట్లు తెలిసింది. వీటిలో నిత్యం పెద్దఎత్తున అనధికార వసూళ్లు ఉంటాయి. జులైలో జరిగిన బదిలీల్లో చెక్‌పోస్టు నుంచి ఇతర కార్యాలయాలకు బదిలీ అయినా, కొందరు మళ్లీ ఓడీ కింద చెక్‌పోస్టులకే వెళ్లారు. నెల్లూరు జిల్లా నుంచి ఓ ఎంవీఐ బదిలీపై కమిషనరేట్‌కు రాగా, వెంటనే ఓడీపై తడ చెక్‌పోస్టుకు వెళ్లారు.

గాజువాకకు బదిలీ అయిన ఓ ఎంవీఐ, కొద్ది రోజుల్లోనే ఏపీ, ఒడిశా సరిహద్దులోని చెక్‌పోస్టుకు వెళ్లారు. ఏలూరు నుంచి ఓ ఎంవీఐ తిరువూరు చెక్‌పోస్టుకు, విజయవాడ నుంచి ఓ ఎంవీఐ బెండపూడి చెక్‌పోస్టుకు ఓడీలు పొంది వెళ్లారు. ఓ ఎంవీఐ విజయవాడ నుంచి కాకినాడకు ఓడీపై వెళ్లారు. ఇలా అన్ని ఓడీలకూ పెద్దఎత్తున డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంగళవారం కూడా మరో 10 మందికి ఓడీలు ఇచ్చేందుకు దస్త్రం సిద్ధం చేశారని సమాచారం.

ఓడీలు రద్దుచేస్తూ ఆదేశాలు.. అయినా కొనసాగింపు:ఓడీల పేరిట చేసిన అనధికార బదిలీలు ప్రభుత్వం దృష్టికి రావడంతో.. వాటిని వెంటనే రద్దుచేయాలని రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు మంగళవారం మెమో జారీచేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఎవరికైనా ఓడీ ఇవ్వాలనుకుంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని అందులో కోరారని తెలిసింది. ఈ ఆదేశాలను రవాణా శాఖలో ఓ ముఖ్య అధికారి తమశాఖ అధికారుల వాట్సప్‌ గ్రూప్‌లో మంగళవారం సాయంత్రం షేర్‌ చేశారు. కీలక అధికారి మాత్రం.. తాను ఓడీలు రద్దు చేసేవరకూ అవి చెల్లుబాటు అవుతాయని, వాళ్లు అదే స్థానాల్లో కొనసాగాలని పేర్కొనడం ఆ శాఖలో చర్చనీయాంశమైంది. ఓడీ రద్దు విషయంలో ముఖ్యకార్యదర్శి ఆదేశాలు చెల్లుతాయా? కీలక అధికారి పంతం నెగ్గుతుందా? అనేది చూడాలని రవాణాశాఖ వర్గాలు చెబుతున్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details