ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉక్రెయిన్‌లో వైద్యవిద్య చుదువుతున్న.. మన విద్యార్థుల భవిష్యత్ ఏంటి? - Ukraine medical students are trying to transfer their seats to other countries

NMC decision regarding Ukraine Medical Students: డాక్టర్‌ కావాలనేది ఎంతోమంది విద్యార్థుల కల! దాన్ని నెరవేర్చుకునేందుకు ఖండాంతరాలు సైతం దాటి వెళ్తున్నారు. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధంతో ఉక్రెయిన్‌లో చదువుతున్న భారత్‌ విద్యార్థులందరూ వెనక్కి వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వైద్యవిద్య కొనసాగించేందుకు వారు కొన్ని వెసులుబాట్లు కోరుకుంటున్నారు. జాతీయ వైద్య మండలి(ఎన్‌ఎంసీ) ఇప్పటికే కొన్ని నిర్ణయాలు తీసుకుంది. వాటితో ప్రయోజనముందా? విద్యార్థులు, నిపుణులు ఏం చెబుతున్నారు?

NMC decision regarding Ukraine Medical Students
ఉక్రెయిన్‌లో వైద్యవిద్య అభ్యసిస్తున్న వారు మన దేశంలో ఇంటర్న్‌షిప్‌ చేయవచ్చు

By

Published : Mar 9, 2022, 6:59 PM IST

NMC decision regarding Ukraine Medical Students: జాతీయ వైద్య మండలి గతేడాది నవంబరు 18న జారీ చేసిన ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ నిబంధనల ప్రకారం.. ఏ దేశంలో వైద్యవిద్య చదివితే అక్కడే ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేసి రావాలి. ఈ నిబంధనను సడలిస్తున్నట్లు ఎన్‌ఎంసీ తాజాగా ప్రకటించింది. ఉక్రెయిన్‌లో వైద్యవిద్య అభ్యసిస్తున్న విద్యార్థులు మన దేశంలో ఇంటర్న్‌షిప్‌ చేసేందుకు అనుమతించింది. అయితే ఇందుకు ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామినేషన్‌(ఎఫ్‌ఎంజీఈ)లో ఉత్తీర్ణత సాధించాలని షరతు విధించింది. సాధారణంగా చైనా, బంగ్లాదేశ్‌, నేపాల్‌, కజకిస్థాన్‌, కిర్గిస్థాన్‌లలో 5+1(ఐదేళ్ల చదువు, ఏడాది ఇంటర్న్‌షిప్‌) పద్ధతిలో వైద్యవిద్య అందిస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్‌, జార్జియా, బెలారస్‌, ఫిలిప్పీన్స్‌లలో 6+1 విధానం ఉంది. చైనా, బంగ్లాదేశ్‌, నేపాల్‌లలో ఎంబీబీఎస్‌ డిగ్రీలోనే ఇంటర్న్‌షిప్‌ ఒక భాగం. మిగిలిన అన్ని దేశాల్లో డాక్టర్‌ ఆఫ్‌ మెడిసిన్‌(ఎండీ) చదువుతో సమానం. అందుకే అక్కడ చదువు పూర్తి చేసుకుని వచ్చిన విద్యార్థులు తప్పనిసరిగా ఇంటర్న్‌షిప్‌ చేశాకే వారికి పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ ఇస్తారు. ఈ వెసులుబాటుతో ఉక్రెయిన్‌లో 5వ, 6వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు పెద్దగా ప్రయోజనం ఒనగూరదని నిపుణులు చెబుతున్నారు. ఎక్కడ చదివితే.. అక్కడే ఇంటర్న్‌షిప్‌ నిబంధనలో సడలింపు గత నవంబరు తర్వాత చేరిన విద్యార్థులకే వర్తిస్తుందని వివరిస్తున్నారు. ప్రస్తుతం ఆఖరి సంవత్సరం అంటే ఐదేళ్ల క్రితం చేరినవారికి పెద్దగా ప్రయోజనం లభించదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక్కడ సర్దుబాటు కుదిరేనా?
ప్రస్తుతం ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన విద్యార్థులను ఇక్కడి కళాశాలల్లో సర్దుబాటు చేసే అవకాశాన్ని ఎన్‌ఎంసీ పరిశీలిస్తోంది. ఇది ఎంతవరకు సాధ్యపడుతుందనేది అనుమానంగా మారింది. చివరి సంవత్సరం విద్యార్థులనే సర్దుబాటు చేసినా.. సిలబస్‌లు వేర్వేరు కావడంతో ఎంతో కసరత్తు చేయాల్సి ఉంటుంది. దీనికితోడు ఖర్చు, సీట్ల లభ్యత దృష్ట్యా విద్యార్థులు ఏ మేరకు ఆసక్తి చూపుతారనేది మరో ప్రశ్న. ఉక్రెయిన్‌లో వైద్యవిద్య పూర్తి చేసేందుకు రూ.30-35 లక్షల వరకు సరిపోగా.. మన దేశంలో కళాశాల స్థాయిని బట్టి రూ.75 లక్షల నుంచి రూ.కోటికిపైగానే ఖర్చవుతుంది.

ఇతర దేశాలకు మార్చుకుంటున్నారు

"ఇంటర్న్‌షిప్‌ విషయంలో వైద్యమండలి కల్పించిన వెసులుబాటుతో పెద్దగా ఒరిగేదేమీ లేదు. ఇంటర్న్‌షిప్‌ చేయడానికి గతంలోనూ ఎఫ్‌ఎంజీ పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలనే నిబంధన ఉంది. ఉక్రెయిన్‌ పరిస్థితులతో ఇప్పటికే చాలామంది విద్యార్థులు ఇతర దేశాలకు సీట్లను బదలాయించుకునేందుకు కన్సల్టెన్సీలను సంప్రదిస్తున్నారు. వైద్యవిద్యలో ఇతర దేశాలకు బదిలీ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. మన దేశంలోని కళాశాలల్లో ప్రవేశాలు కల్పించాలనే చర్చ నడుస్తున్నప్పటికీ.. అది సాధ్యం కాదనేది నా అభిప్రాయం." -హెచ్‌.ఎం.ప్రసాద్‌, అపెక్స్‌ కన్సల్టెన్సీ, హైదరాబాద్‌

ఫీజులు తగ్గించాలి

భారత్‌లో వైద్యవిద్య ఖర్చుతో కూడుకున్నది కావడంతో పలువురు విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారు. జాతీయ వైద్య మండలి ఇక్కడ చదువుకోవడానికి అవకాశమిస్తే.. కళాశాలల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ, ఫీజుల విషయంలోనూ మినహాయింపు ఇవ్వాలి. ఉక్రెయిన్‌తో పోల్చితే ఇక్కడ చాలా వ్యయమవుతుంది. తక్కువ ఫీజును నిర్ణయించాలి. -అడ్డాల ఆహ్లాద, రెండో ఏడాది విద్యార్థిని, ఉక్రెయిన్‌

ఇంటర్న్‌షిప్‌నకు అనుమతించడం మంచిదే

"ఉక్రెయిన్‌లో నాకు మరో ఏడాది చదువు మిగిలి ఉంది. ఎన్‌ఎంసీ నిర్ణయం నాలాంటి విద్యార్థులకు కలిసివస్తుంది. ఎఫ్‌ఎంజీ పరీక్ష విషయంలో కొన్ని వెసులుబాట్లు కల్పించాలి. అలాగే రెండో, మూడో సంవత్సరాల విద్యార్థుల పరిస్థితి గురించీ ఆలోచించాలి. ఇక్కడి కళాశాలలకు బదిలీ చేసుకుని.. చదవాలంటే ఖర్చులు భరించడం మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులతో అయ్యేది కాదు." - ఎస్‌.సుప్రియ, అయిదో సంవత్సరం విద్యార్థిని

ఇదీ చదవండి:"విదేశీ మహిళపై అత్యాచారయత్నం చేసింది.. వైకాపా కార్యకర్తలే"

ABOUT THE AUTHOR

...view details