ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో టెన్షన్.. వరంగల్ వ్యక్తికి యూకే వైరస్! - telangana news

ప్రపంచ దేశాలను వణికిస్తున్న యూకే వైరస్‌ కలకలం తెలంగాణ రాష్ట్రాన్ని భయపెడుతోంది. కొత్తగా మార్పుచెందిన ఈ వైరస్‌కు సంబంధించి తొలికేసు నమోదైనట్లు తెలుస్తోంది. వరంగల్‌ నగర జిల్లాకు చెందిన 49ఏళ్ల వ్యక్తిలో వైరస్‌ ఉన్నట్లు గుర్తించిన సీసీఎంబీ... కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది. ఐతే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించని వైద్యారోగ్యశాఖ పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది.

uk virus entering into the telangana state
uk virus entering into the telangana state

By

Published : Dec 29, 2020, 6:39 AM IST

ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తున్న యూకే వైరస్‌ తొలి కేసు తెలంగాణ రాష్ట్రంలో నమోదైనట్లు తెలుస్తోంది. యూకే నుంచి ఈ నెల 10న వచ్చిన 49 ఏళ్ల వ్యక్తిలో కొత్తగా మార్పు చెందిన కరోనా వైరస్‌ ఉన్నట్లు సీసీఎంబీ నిర్ధారించినట్లు సమాచారం. ఐతే.. వైద్య ఆరోగ్య శాఖ మాత్రం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పటికే ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు తెలుస్తోంది. అలాగే యూకే వైరస్‌ ప్రవేశంపై దేశంలో ఎక్కడా ఇప్పటిదాకా అధికారిక ప్రకటనలేమి లేవు. వివిధ రాష్ట్రాల్లో ఈ తరహాలో పరీక్షలు కొనసాగుతుండటంతో... వాటన్నింటి ఫలితాలు సమీకరించి ఒకేసారి కేంద్ర ఆరోగ్యశాఖే వెల్లడించే అవకాశాలున్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి.

వరంగల్​ జిల్లాకు చెందిన వ్యక్తిలో గుర్తింపు!

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.... వరంగల్‌ నగర జిల్లాకు చెందిన వ్యక్తికి కొత్త రూపు సంతరించుకున్న కొవిడ్‌ సోకినట్లు తెలుస్తోంది. ఈ వ్యక్తిలో ఈ నెల 16న కొవిడ్‌ లక్షణాలు కనిపించగా స్థానికంగా పరీక్షలు చేయించారు. 22న వెల్లడైన ఫలితాల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. అప్పటి నుంచి వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండురోజుల కిందట సేకరించిన నమూనాలను సీసీఎంబీకి పంపించారు. కరోనా జన్యుపరిణామ క్రమ విశ్లేషణ పరీక్షల్లో వైరస్‌లో గణనీయ మార్పులు చోటుచేసుకున్నట్లు గుర్తించారు. యూకేలో మార్పు చెందిన వైరస్​.. ఇది ఒక్కటేనని నిర్ధరించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారమిచ్చారు. బాధితుడి కుటుంబసభ్యులకు యుద్ధప్రాతిపదికన పరీక్షలు నిర్వహించారు. బాధితుడి భార్య సహా ఇతరులకు కొవిడ్‌ నెగిటివ్‌ రాగా..... 71ఏళ్ల వయస్సు ఉన్న అతడి తల్లి పాజిటివ్‌గా తేలింది. ఆమెను కూడా ఆసుపత్రిలో చేర్చించి చికిత్స అందిస్తున్నారు. ఆమె నుంచి నమూనాలు సేకరించి విశ్లేషణ కోసం సీసీఎంబీకి పంపించారు.

నిలకడగానే ఆరోగ్యం

యూకే వైరస్‌ సోకిన వ్యక్తితోపాటు తల్లిలో ఎలాంటి తీవ్ర అనారోగ్య సమస్యలు లేవు. వారి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. మరో 7 నుంచి పది రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచనున్నట్లు వివరించారు. ఐతే తాజా నిబంధనల ప్రకారం యూకే వైరస్‌ పాజిటివ్‌గా తేలిన వారిలో చికిత్స అనంతరం పరీక్షల్లో రెండుసార్లు నెగిటివ్‌గా వస్తేనే పూర్తిస్థాయిలో ముప్పు తొలగిపోయినట్లుగా నిర్ధరిస్తారు. ప్రస్తుతానికి వరంగల్‌ కేసుకు సంబంధించి కుమారుడిలో మాత్రమే యూకే వైరస్‌ ఉన్నట్లుగా గుర్తించడంతో... ఈ విధానం ఆయనకు మాత్రమే వర్తిస్తుంది. తల్లికి సాధారణ కొవిడ్‌ నిబంధనలే వర్తిస్తాయి. ఆ కుటుంబసభ్యులతో సన్నిహితంగా మెలిగిన ఇతరులకూ మరోసారి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం బాధితుడితో సన్నిహితంగా మెలిగిన వారందరినీ రెండు వారాల పాటు ఇళ్లవద్ద ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యఆరోగ్యశాఖ అధికారులు కోరారు.

వైద్యారోగ్య అప్రమత్తం

మార్పు చెందిన వైరస్‌ నియంత్రణకు వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. తొలిదశలోనే అడ్డుకోవడానికి యుద్ధప్రాతిపదికన కార్యాచరణను సిద్ధం చేసంది. ఈ శాఖ కార్యదర్శి సోమవారం ఉన్నతాధికారులతో అత్యవసరంగా భేటీ అయ్యారు.

ఇదీ చూడండి:

కరోనా స్ట్రెయిన్ పట్ల ఆందోళన అనవసరం: గవర్నర్

ABOUT THE AUTHOR

...view details