పేదలకు ఇళ్లు కావాలన్నా.. బ్యాంకు రుణాలు లభించాలన్నా.. ప్రభుత్వం ఇస్తున్న పింఛన్ పొందాలన్నా.. ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలన్నా.. ఏ ప్రభుత్వ కార్యక్రమం అమలు చేయాలన్నా... ఆధార్ నెంబరు తప్పనిసరని ప్రభుత్వాలు స్పష్టం చేస్తున్నాయి. ఆధార్‌ను ప్రామాణికంగా తీసుకుని సంక్షేమ పథకాలు అమలు చేయడం ద్వారా.. పారదర్శకత పెంపొందించడమే కాకుండా... ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉంటుందని పాలకులు భావిస్తున్నారు.
జారీ మరింత సరళం
ప్రైవేటు కార్యకలాపాలు కూడా ఆధార్‌నే ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. ప్రతి అంశంలోనూ ఆధార్ కార్డు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డుల జారీని మరింత సరళతరం చేయడం ద్వారా వేగాన్ని పెంచాలని యూఐడీఏఐ యోచిస్తోంది. 20 రోజుల నుంచి రెండు నెలలు పడుతున్న సమయాన్ని తగ్గించాలని భావిస్తోంది. పాస్‌పోర్టు తరహాలోనే వేగంగా ఆధార్ కార్డులు అందించాలని యోచిస్తోంది.
తెలంగాణలో 3 కోట్ల 98 లక్షల ఆధార్ కార్డులు ఉండగా... ప్రతి నెల సగటున 30 నుంచి 40వేల కార్డులు కొత్తవి జారీ అవుతున్నాయి. ఏపీలో మొత్తం 5 కోట్ల 32 లక్షల కార్డులు ఉండగా.. సగటున 35వేల నుంచి 50వేల వరకు కొత్తకార్డులు జారీ అవుతున్నాయి. ఆధార్ కార్డుల జారీలో వేగం పెంచే దిశలో యూఐడీఏఐ కసరత్తు చేస్తోంది. పుట్టిన తేదీ, చిరునామాతోపాటు ఇతర వివరాలన్నింటిని పరిశీలన చేసి నిర్దరించుకున్న తర్వతనే ఆధార్ కార్డు జారీ జరుగుతుందని చెబుతున్న అధికారులు.... ఏ విధానంలో వేగంగా కార్డులు జారీ చేయగలమన్న అంశంపై ఉన్నతస్థాయిలో అధ్యయనం చేస్తున్నట్లు చెబుతున్నారు.