ప్లవ నామ సంవత్సర ఉగాది ఉత్సవాల్లో భాగంగా... రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కర్నూలులోని కల్లూరు చౌడేశ్వరీ దేవి ఆలయంలో ఏర్పాటుచేసిన ఎడ్ల బండ్ల పోటీ విశేషంగా ఆకట్టుకుంది. ఆలయం చుట్టూ బంకమట్టితో బురద ఏర్పాటుచేసి, అందులో ఎద్దులతో ప్రదక్షిణ నిర్వహించారు. ఇలా చేయడం వల్ల అంతా మంచే జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు.
ఉగాది వేళ నెల్లూరులో అమ్మవారి నగరోత్సవాలు వైభవంగా జరిగాయి. ఇరుకళల పరమేశ్వరి, మూలపేట అంకమ్మ తల్లి, భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి, వీరభద్ర స్వామి ఊరేగింపులు.. కోలాహలంగా సాగాయి. ఈ కార్యక్రమాల్లో పెద్దఎత్తున పాల్గొన్న భక్తులు... అమ్మలకు కొబ్బరికాయలు కొట్టి, కర్పూర హారతులు ఇచ్చారు.
ఉగాది సందర్భంగా నిర్వహించిన 'మిస్ ఒంగోలు' పోటీలు అదరహో అనిపించాయి. కార్యక్రమంలో భాగంగా యువతులు చేసిన ర్యాంప్ వాక్ అందర్నీ ఆకర్షించింది. నృత్య ప్రదర్శనలు, సంగీత విభావరి మెప్పించాయి.