గుండుతో విధుల్లో చేరేందుకు సిద్ధమైన ఉబర్ క్యాబ్ డ్రైవర్‌కు వింత అనుభవం ఎదురైంది. అతడి ముఖాన్ని ఉబర్ యాప్ గుర్తుపట్టకపోవడంతో ఉపాధికి దూరమయ్యాడు. ఈ వింత ఘటన హైదరాబాద్‌కు చెందిన డ్రైవర్ శ్రీకాంత్‌కు ఎదురైంది. తిరుమల శ్రీవారిని దర్శించుకొని తలనీలాలు సమర్పించుకున్న అతడు.. ఫిబ్రవరి 27న పలుమార్లు సెల్ఫీతో లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించగా సాధ్యపడలేదు. దీంతో నాలుగోసారి మళ్లీ ప్రయత్నిస్తే అతడి ఖాతా పూర్తిగా బ్లాక్ కావడంతో కొత్త కష్టాలు మొదలయ్యాయి. దాదాపు ఏడాదిన్నరగా ఉబర్‌లో పనిచేస్తున్న అతడు ఇప్పటివరకు 1428 ట్రిప్‌లతో 4.67 స్టార్ రేటింగ్‌తో ఉన్నాడు. తనకు ఎదురైన ఇబ్బందిపై ఆవేదన వ్యక్తంచేశాడు.
‘‘తిరుమల నుంచి వచ్చాక నా ఉబర్ ఖాతాలో లాగిన్ అయ్యేందుకు ప్రయత్నిస్తే తలపై జుట్టు లేకపోవడంతో యాప్ నన్ను గుర్తించలేదు. నా ఖాతా బ్లాక్ అయింది. మరుసటి రోజు ఉబర్ కార్యాలయానికి ఫిర్యాదు చేసేందుకు వెళ్తే.. నా కారుకు వేరే డ్రైవర్‌ను పెట్టుకోవాలని సూచించారు. కానీ, నేను అంత భరించలేను. నెల తర్వాత మళ్లీ ఉబర్ కార్యాలయానికి పలుమార్లు తిరిగితే.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఫిర్యాదు చేసేందుకు ఒక ఈ-మెయిల్ ఐడీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ ఇంకా ఆ వ్యవహారం నడుస్తూనే ఉంది’’ అని వాపోయాడు.