ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజకీయ పోస్టులు ఫార్వర్డ్​.. ఇద్దరు తెదేపా సానుభూతిపరులు అరెస్టు

ఇద్దరు తెలుగుదేశం సానుభూతిపరులను పోలీసులు అరెస్టు చేశారు. విశాఖలో నలంద కిశోర్‌ అనే వ్యక్తిని ఈ తెల్లవారుజామున సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో రాజకీయ పోస్టులను ఫార్వర్డ్ చేసిన కారణంగా అరెస్టు చేశారు. మంత్రి గంటా శ్రీనివాసరావుకి నలంద కిశోర్ అనుచరుడు కావడంతో... రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మరోవైపు కృష్ణా జిల్లా నందిగామలో తెదేపా సోషల్‌ మీడియా కార్యకర్త కృష్ణారావును సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. అవినీతి చేసిన వాళ్లను వదిలేసి...అక్రమాలను ప్రశ్నించిన వారిని వేధింపులకు గురి చేస్తారా అని తెదేపా అధినేత చంద్రబాబు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

social media posts
social media posts

By

Published : Jun 23, 2020, 3:38 PM IST

రాష్ట్రంలో సోషల్​ మీడియా కార్యకర్తల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా తెదేపా సామాజిక మాధ్యమ కార్యకర్త చిరుమామిళ్ళ కృష్ణారావుతో పాటు విశాఖలో నలంద కిశోర్ అనే వ్యక్తిని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారని చిరుమామిళ్ళ కృష్ణారావుపై కేసు నమోదు చేసింది సీఐడీ.

కొన్ని రోజుల కిందటే...

కొన్ని రోజుల కిందటే సీఐడీ అధికారులు కృష్ణారావును అదుపులోకి తీసుకొని మంగళగిరిలోని సీఐడీ కార్యాలయానికి తీసుకొచ్చి విచారించి పంపించారు. ఇప్పుడు అరెస్ట్ చేయడంతో తెదేపా నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం కావాలనే ప్రతిపక్షంపై కేసులు నమోదు చేసి ఇబ్బంది పెడుతుందని ఆరోపించారు. అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఫార్వడ్ చేశారన్న కారణంతో అరెస్ట్

సామాజిక మాధ్యమాల్లో రాజకీయ పోస్టులను ఫార్వర్డ్ చేసినందుకు తెదేపా సానుభూతిపరుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. నలంద కిశోర్ అనే వ్యక్తిని తెల్లవారుజామున 3 గంటల సమయంలో సీబీఎం కాంపౌండ్​లోని ఆయన నివాసంలో సీఐడీ అదుపులోకి తీసుకుంది. ఆరోగ్యం సరిగా లేదని.. ఉదయం వస్తానని చెప్పినా పోలీసులు వినలేదని కిశోర్ బంధువులు తెలిపారు. మాజీమంత్రి గంటా శ్రీనివాసరావుకి నలంద కిశోర్ అనుచరుడు కావడంతో ఈ అరెస్టు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మంత్రి అవంతి శ్రీనివాసరావు, ఎంపీ విజయసాయిరెడ్డిపై ప్రచారంలో ఉన్న పోస్టులను నలంద కిశోర్ ఫార్వర్డ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కిశోర్‌ని మంగళగిరి కోర్టులో పోలీసులు హాజరుపరచనున్నారు.

దేశద్రోహమా..?: గంటాశ్రీనివాసరావు

తెదేపా సానుభూతిపరుడు నలంద కిశోర్ అరెస్టుపై మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. కిశోర్‌ చేసింది దేశద్రోహమా..? అని ప్రశ్నించారు. ఆయనేమీ రక్షణ వ్యవహారాలు లీక్ చేయలేదన్న గంటా... సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఫార్వర్డ్ మెసేజ్‌ను షేర్ మాత్రమే చేశారన్నారు. ఈ మాత్రం దానికి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.

అమాయకులపై ప్రతాపమా..?: లోకేశ్

వైకాపా ఎన్ని అరాచకాలు చేసినా నోరు మెదపని సీఐడీ... అమాయకులపై ప్రతాపం చూపిస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. ఇసుక అక్రమాలు, ఇళ్ల స్థలాలు అమ్మకాలు, ఇళ్ల స్థలాల కొనుగోలు పేరుతో కోట్లు కొల్లగొట్టినప్పుడు, విషం కన్నా ప్రమాదకరమైన మందు పోస్తూ వేల కోట్లు జే ట్యాక్స్ వసూలు చేసినప్పుడు, 108 స్కామ్, మైన్స్ మింగేసినప్పుడు సీఐడీ ఏమైపోయిందని ఆయన ప్రశ్నించారు. వైకాపా నేతలు మహిళలను వేధించినప్పుడు సీఐడీ ఎక్కడుందని మండిపడ్డారు.

ఇనుప సంకెళ్ల పాలన: బుద్దా

సామాజిక మాధ్యమాల్లో సాక్ష్యాధారాలతో ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా నాయకులపై అసభ్య పదజాలంతో పోస్టింగులు పెడుతున్న వారిని వదిలేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఏడాదికాలంగా ఇనుప సంకెళ్ల పాలన నడుస్తోందన్న ఆయన... జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించరని మండిపడ్డారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో పోలీసు రాజ్యం.. కేంద్ర మంత్రి చెప్పింది నిజం: సోమిరెడ్డి

ABOUT THE AUTHOR

...view details