అతివేగం ప్రమాదకరం అని పోలీసులు, ప్రభుత్వం ఎన్ని విధాలుగా అవగాహన కల్పిస్తున్నా.. వాహనదారులు పట్టించుకోవడం లేదు. స్వల్ప సమయం కోసం ఆలోచిస్తూ.. విలువైన ప్రాణాలను పణంగా పెడుతున్నారు. గుంటూరు, అనంతపురం జిల్లాల్లో ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో.. ఓ చోట వేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీకొనగా.. మరోచోట రాంగ్ రూట్లో వచ్చి కారును ఢీకొట్టాడు ద్విచక్రవాహనదారుడు.
గుంటూరు జిల్లాలో...
కొల్లూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో కూచిపూడి రంగారావు అనే వ్యక్తి మరణించారు. దోనేపూడి నుంచి కొల్లూరుకు కరకట్ట మార్గంలో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. బైక్‌ని కారు ఈడ్చుకుంటూ వెళ్లగా.. పెట్రోలు లీకై మంటలు వ్యాపించి ద్విచక్ర వాహనం దగ్ధమైంది. కారు డ్రైవర్ పరారు కాగా.. అతడిని అరెస్ట్ చేసే వరకు మృతదేహాన్ని తీసుకువెళ్లమని రంగారావు బంధువులు ఆందోళనకు దిగారు. వారికి నచ్చజెప్పి మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.