Orphan Students Were Raped : హైదరాబాద్‌లో అనాథ బాలికల వసతి గృహంలో ఉంటున్న ఇద్దరు ఇంటర్ విద్యార్థినులపై.. తమ స్నేహితులు వేర్వేరు రోజుల్లో అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పుట్టినరోజు వేడుకలు చేసుకుందామంటూ ఒకరు.. సినిమాకు వెళ్దామంటూ మరొకరు ఇద్దరు విద్యార్థినిలను వేర్వేరు రోజుల్లో వసతి గృహం నుంచి బయటకి తీసుకెళ్లారు. నెక్లెస్‌రోడ్‌కు తీసుకెళ్లిన విద్యార్థినిపై కారులోనే అత్యాచారం చేయగా.. మరో విద్యార్థినిని సినిమాకు తీసుకెళ్లిన నిందితుడు.. అత్తాపూర్‌లోని ఓ మాల్‌లో అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
ఈ రెండు ఘటనలు ఏప్రిల్‌లోనే జరగగా.. ఇద్దరు బాధితులు భయంతో ఇప్పటివరకూ చెప్పలేదు. చివరకు జూన్ 3న వసతిగృహం అధికారులకు చెప్పగా.. వారు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న హుమయూన్‌నగర్ పోలీసులు ఘటన జరిగిన ప్రాంతాల ఆధారంగా ఒక అత్యాచారం కేసును రాంగోపాల్‌పేట పోలీస్‌ఠాణాకు.. మరో అత్యాచారం కేసును రాజేంద్రనగర్ పోలీస్‌ఠాణాకు ‘జీరో ఎఫ్‌ఐఆర్’గా బదిలీ చేశారు. రాంగోపాల్‌పేట పోలీసులు ఒక నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. మరో కేసులో నిందితుడి కోసం గాలిస్తున్నారు.
అనాథ బాలికల వసతిగృహంలో ఉంటూ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదువుకుంటున్న విద్యార్థినికి.. ఆమె స్నేహితుడు ఏప్రిల్ 20న తన పుట్టినరోజు వేడుక నెక్లెస్‌రోడ్‌లో చేసుకుందామని పిలిచాడు. బాధితురాలితోపాటు మరోఇద్దరు విద్యార్థినులు, నిందితుడితో కలిసి నెక్లెస్‌రోడ్‌కు కారులో వెళ్లారు. అదేరోజు అర్ధరాత్రి స్నేహితులంతా కలిసి కబుర్లు చెప్పుకొంటుండగా.. అతను బాధితురాలి వద్దకు వచ్చి కారులో మాట్లాడుకుందామని మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. ఆమె కారులో కూర్చోగానే.. నిందితుడు లైంగిక దాడి చేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించడంతో.. బాధితురాలు భయపడి చెప్పలేదు. కొద్దిరోజుల నుంచి ఆమె ప్రవర్తనలో తేడా రావడంతో సంక్షేమశాఖ అధికారి ప్రశ్నించగా.. తనపై అత్యాచారం చేశాడంటూ వివరించింది. బాధితురాలు తెలిపిన వివరాలతో అధికారి అదేరోజు ఫిర్యాదు చేశారు.
అనాథ బాలికల వసతి గృహంలో ఉంటున్న ఇంటర్ చదువుతున్న మరో విద్యార్థినికి.. తాను చదువుకుంటున్న కళాశాలలో ఇద్దరు విద్యార్థులు స్నేహితులయ్యారు. ఏప్రిల్ 25న ఇంటర్ పరీక్షలు పూర్తికాగానే.. సినిమాకు వెళ్దామంటూ బాధితురాలి స్నేహితుడు ప్రతిపాదించాడు. బాధితురాలు ఒప్పుకోవడంతో.. మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ముగ్గురూ అదేరోజు రాత్రి కారులో అత్తాపూర్‌లోని ఓ థియేటర్‌కు సినిమాకెళ్లారు. సినిమా చూస్తుండగా.. పక్కనే కూర్చున్న స్నేహితుడు కూల్‌డ్రింక్ తాగుదామంటూ చెప్పి బయటకి తీసుకొచ్చాడు. ఎవరూ లేని ప్రదేశం చూసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించడంతో ఆమె నిశబ్దంగా ఉండిపోయింది. సంక్షేమశాఖ అధికారులు శుక్రవారం రాత్రి తోటి విద్యార్థిని ప్రశ్నించడం, తనపై అత్యాచారం చేశారంటూ వివరించడంతో.. తనను కూడా బలాత్కరించారంటూ చెప్పింది.