Suspend: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖకు చెందిన ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, మరో డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. మరో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌కు ఛార్జి మెమో ఇచ్చారు. ఈ మేరకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులిచ్చారు. ఈ 483 జీవో రెండు రోజులు ఆలస్యంగా శనివారం వెలుగులోకి వచ్చింది. ఉపాధి పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో జాప్యంపై హైకోర్టు ఆయనపై ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకోవడం గమనార్హం.
శాఖాపరంగా ఇటువంటి తీవ్ర చర్యలు తీసుకోవడంపై సంబంధిత వర్గాల్లో చర్చనీయాంశమైంది. జాతీయ ఉపాధి హామీ పథకం (నరేగా) మెటీరియల్ కాంపొనెంట్ కింద చేసిన పనికి సంబంధించిన కోర్టుధిక్కరణ కేసులో హాజరైన ముఖ్యకార్యదర్శిపై హైకోర్టు 14న ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విదితమే. హైకోర్టు ఆదేశించినా గుత్తేదారులకు బిల్లులు చెల్లించరా? అని గట్టిగా ప్రశ్నించింది. ఈ పరిస్థితికి ప్రకాశం జిల్లా మార్కాపురం పంచాయతీరాజ్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వై.రమేశ్‌బాబు, డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ పీవీ సుబ్బారావు ప్రధాన కారణమని పేర్కొంటూ ముఖ్యకార్యదర్శి ద్వివేది వారిద్దరినీ 16న సస్పెండ్ చేశారు. డీఈఈ కె.ఆదినారాయణకు ఛార్జి మెమో ఇచ్చారు.