ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఓబుళాపురంలో రెండు లీజులకు ఇంకా కాలపరిమితి.. ప్రభుత్వ నిర్ణయం ఓఎంసీ కోసమే ! - ఓఎంసీ తాజా వార్తలు

OMC: ఓబుళాపురం ప్రాంతంలో మూడు ఇనుప ఖనిజ లీజులకు కాలపరిమితి ఇంకా ఉంది. అందులో రెండు లీజులు గాలి జనార్దనరెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీవే. ఈ నేపథ్యంలో ఇనుప ఖనిజ తవ్వకాలకు అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పడం.... O.M.Cకి మేలు కలిగించేందుకు ప్రయత్నించడం కాదా అనే ప్రశ్న వినిపిస్తోంది.

ఓబుళాపురంలో రెండు లీజులకు ఇంకా కాలపరిమితి
ఓబుళాపురంలో రెండు లీజులకు ఇంకా కాలపరిమితి

By

Published : Aug 12, 2022, 3:59 AM IST

OMC: 'ఓబుళాపురం ప్రాంతంలో మూడు ఇనుప ఖనిజ లీజుల కాలపరిమితి ముగిసింది. కోర్టు కేసు పరిష్కారం అయితే వీటిని ఈ-వేలం ద్వారానే కేటాయిస్తాం. ఇందులో గాలి జనార్దనరెడ్డికి ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోందనేది వక్రీకరణే..' అంటూ గనులశాఖ సంచాలకుడు వీజీ వెంకటరెడ్డి బుధవారం వివరణ ఇచ్చారు. తమ భూ భాగంలో ఇనుప ఖనిజ తవ్వకాలకు అభ్యంతరం లేదంటూ సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం తెలియజేయడం వెనుక.. ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీకి మేలుచేసే ఉద్దేశముందని ‘ఈనాడు’లో కథనం ప్రచురితం కావడంపై గనులశాఖ సంచాలకుడు పైవిధంగా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కానీ ఇక్కడే అసలైన లాజిక్కు ఉంది. అదే ప్రాంతంలో మరో మూడు ఇనుప ఖనిజ లీజులకు ఇంకా కాలపరిమితి ఉంది. అందులో రెండు లీజులు మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డికి చెందిన ఓఎంసీ(ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ)వే. దీంతో ఇనుప ఖనిజ తవ్వకాలకు అభ్యంతరం లేదంటూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం.. ఓఎంసీకి మేలు కలిగించేందుకు ప్రయత్నించడం కాదా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

ఏపీ, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు అంశంపై స్పష్టత వచ్చినందున, మళ్లీ తవ్వకాలను ప్రారంభించేందుకు అనుమతివ్వాలంటూ ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ సుప్రీంకోర్టులో కోరడం.. తమ భూభాగంలో తవ్వకాలకు ఎటువంటి అభ్యంతరం లేదంటూ ఏపీ ప్రభుత్వం తెలియజేసిన అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఓఎంసీకి చెందిన రెండు లీజుల గడువు ఇంకా ఉండటం వల్లే ఆ సంస్థ మళ్లీ తవ్వకాల కోసం ప్రయత్నాలు చేస్తోందని, రాష్ట్ర సర్కారు కూడా ఇందుకు సహకరించేందుకు చూస్తోందనే వాదన వినిపిస్తోంది. అనంతపురం జిల్లా డి.హీరేహళ్‌ మండలంలోని బళ్లారి రక్షిత అటవీ ప్రాంతంలో ఆరు ఇనుప ఖనిజ లీజులు ఉన్నాయి. ఇందులో ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ)కి ఓబుళాపురంలో 25.981 హెక్టార్లు, 39.5 హెక్టార్లు, హెచ్‌.సిద్ధాపురం, మలపనగుడి పరిధిలో 68.5 హెక్టార్లు, అనంతపురం మైనింగ్‌ కంపెనీ (ఏఎంసీ)కి ఓబుళాపురంలో 6.5 హెక్టార్లు, హెచ్‌.సిద్ధాపురంలో బళ్లారి ఐరన్‌ ఓర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (బీఐఓపీ)కి 27.120 హెక్టార్లు, వై.మహాబళేశ్వరప్ప అండ్‌ సన్స్‌కు 20.24 హెక్టార్లలో ఇనుప ఖనిజ లీజులు ఉన్నాయి. ఇందులో ఓఎంసీ గాలి జనార్దన్‌రెడ్డికి చెందిన సంస్థకాగా, ఏఎంసీ ఆయన సతీమణి పేరిట ఉంది.

ఓఎంసీ లీజులకు 2057 వరకు గడువు

  • నిబంధనల ప్రకారం ఇనుప ఖనిజ లీజును తొలుత 20 ఏళ్లకు ఇస్తారు. తర్వాత 20 ఏళ్లు, మళ్లీ 10 ఏళ్లకు రెన్యువల్‌ చేస్తారు. మొత్తంగా 50 ఏళ్ల కాలపరిమితి ఉంటుంది.
  • ఓఎంసీకి చెందిన 25.981 హెక్టార్లు, ఏఎంసీకి చెందిన 6.5 హెక్టార్లు, బీఐఓపీకి చెందిన 27.120 హెక్టార్ల లీజులు 1971లో మంజూరయ్యాయి. ఈ మూడు లీజుల యాభై ఏళ్ల గడువు గత ఏడాదితో ముగిసింది.
  • వై.మహాబళేశ్వరప్ప అండ్‌ సన్స్‌కు చెందిన 20.24 హెక్టార్ల లీజు 1978లో మంజూరైంది. దీని గడువు 2028 వరకు ఉంది.
  • ఇక ఓఎంసీకి చెందిన 39.5 హెక్టార్లు, 68.5 హెక్టార్ల లీజులు మాత్రం 2007 జూన్‌లో మంజూరయ్యాయి. వీటి గడువు 2057 వరకు ఉంది.

అందుకే తవ్వకాలకు తొందర:ఇంకా కాలపరిమితి ఉన్న ఓఎంసీకి చెందిన రెండు లీజుల విస్తీర్ణం కలిపి 108 హెక్టార్ల మేర ఉంది. వీటిలో పెద్దఎత్తున ఇనుప ఖనిజ నిల్వలు ఉన్నాయి. అందుకే వీటిలో తవ్వకాలు జరిపేందుకు ఆ సంస్థ ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. అంతర్‌రాష్ట్ర సరిహద్దు వివాదం కొలిక్కి వచ్చినందున, ఈ లీజులపై సస్పెన్షన్‌ ఎత్తివేయించి, తవ్వకాలు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ లీజుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, అన్ని విధాలా ఉల్లంఘనలకు పాల్పడ్డారని గతంలో కేంద్ర సాధికార సంస్థ (సీఈసీ) సుప్రీంకోర్టుకు నివేదికలు ఇచ్చింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ తవ్వకాలకు అభ్యంతరం లేదని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details