‘ఆడపిల్లని అంతదూరం పంపాలా?’, ‘స్థోమతకు మించి వెళ్తున్నారేమో!’ అని అందరూ వారించినా ఆ తల్లిదండ్రలు వెనకడుగేయలేదు. ఆమెను వైజాగ్ పంపారు. వాళ్ల నమ్మకాన్ని నిలబెడుతూ చదువు పూర్తి కాకుండానే రూ.44 లక్షల ప్యాకేజీతో అమెజాన్‌లో ఉద్యోగాన్ని సాధించింది స్నేహ: స్నేహ వాళ్లది శ్రీకాకుళం జిల్లా పలాస. తండ్రి కొంచాడ సింహాచలం పారామిలిటరీలో పనిచేశారు. అనారోగ్యంతో ఆ ఉద్యోగాన్ని వదిలి జీడిపప్పు కర్మాగారంలో గుమస్తాగా చేస్తున్నారు. అమ్మ సుభాషిణి. చిన్నప్పట్నుంచీ గణితం పైన ఇష్టం పెంచుకున్న స్నేహ ఇంటర్ వరకూ పలాసలోనే చదివింది. ఎంసెట్‌లో తన ర్యాంకుకు విశాఖలో ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో ఉచిత సీటొచ్చింది. కానీ.. హాస్టల్, ఇతర ఖర్చులకు ఏటా లక్షన్నరవుతుంది. తండ్రిది చిన్న ఉద్యోగం, తనకీ, తమ్ముడి చదువులకీ అప్పటికే చాలా ఖర్చవడంతో వైజాగ్ వెళ్లడానికి వెనకాడింది. ‘నాన్న ... అవన్నీ నీకెందుకు? చదువు మీదే దృష్టి పెట్టు అనే వారు. ‘అంత దూరమెందుక’ని చాలామంది వారించారు. నాన్న పట్టించుకోలేదు. భవిష్యత్తే ముఖ్యమన్నారు. ఇంజినీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్ తీసుకున్నా. గణితం మీద పట్టు కోడింగ్‌పై ఆసక్తిని కలిగించింది. స్నేహితులతో కలిసి కోడింగ్ మీద ఎక్కువ సమయం వెచ్చించే దాన్ని. అధ్యాపకులూ మా నైపుణ్యాల్ని సానపెట్టారు. కొవిడ్ వల్ల ఇబ్బంది పడినా ఆన్‌లైన్‌లో కొత్త సాఫ్ట్‌వేర్లను నేర్చుకున్నాం, నైపుణ్యాలకు మెరుగులద్దుకున్నాం’ అని చెప్పుకొచ్చింది స్నేహ. తనిప్పుడు బీటెక్ ఆఖరి సంవత్సరం. ప్రాంగణ నియామకాల్లో టెకీగై, విప్రో, ఐబీఎం, క్యాప్‌జెమినీ, మైండ్‌ట్రీ, డెలాయిట్ సంస్థలకు ఎంపికయ్యింది. అమెజాన్‌కీ దరఖాస్తు చేసింది. సామాజిక మాధ్యమాల ద్వారా సీనియర్ల సూచనలు, అనుభవాలు తెలుసుకుంది. ‘అవన్నీ ఇంటర్వ్యూకు ఉపయోగపడ్డాయి. ఫలితమే రూ.44 లక్షల వార్షిక వేతనంతో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా ఉద్యోగం. ఇప్పుడు నన్ను చూసి అమ్మానాన్న గర్వపడుతున్నారు. నాన్న మాటలు నాకెపుడూ బాధ్యతను గుర్తుచేసేవి.. అందుకే పట్టుదలగా ప్రయత్నించా. కోడింగ్ వైపు వెళ్లాలని ముందే నిర్ణయించుకున్నా. దానిపై ఎక్కువ దృష్టిపెట్టా. తోటివారికీ ఇదే చెబుతా! మీ ఆసక్తిని గ్రహించి, లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. అప్పుడు మార్గం స్పష్టమవుతుంది, విజయమూ దక్కుతుంది’ అంటోంది స్నేహ.
అమ్మానాన్నలు కలగన్నారు.. అమ్మాయిలు గెలిచి చూపించారు..!
vasundhara: ఒకప్పుడు ఆడపిల్లలకు చదువు ఎందుకు అనుకునే తల్లిదండ్రుల కాలం నుంచి ఇప్పుడు కాస్త అండగా నిలబడి, ధైర్యాన్నిస్తే చాలు ఆడపిల్లలు ఏదైనా సాధిస్తారనే నమ్మకం తల్లిదండ్రుల్లో పెరుగుతోంది! అందుకు ఉదాహరణే ఈ ఇద్దరమ్మాయిలు.. అతి సాధారణ కుటుంబాల నుంచి వచ్చినా అద్భుతమైన విజయాలతో అమ్మానాన్నల నమ్మకాన్ని నిజం చేసి చూపారు స్నేహ, భావన. మరి వారి విజయ రహస్యాలను మనమూ తెలుసుకుందామా?
రసాయన శాస్త్రంలో 19 బంగారు పతకాలు సాధించిన భావన: భావన వాళ్ల అమ్మ డిగ్రీ పాసైనా ఆ విషయం చాలాకాలం ఆమెకు తెలియనివ్వలేదు ఇంట్లోవాళ్లు. తెలిస్తే ఆమె ఎక్కడ ఉద్యోగం చేస్తానంటుందో అన్న భయమే అందుకు కారణం. భావన వాళ్లది కర్ణాటకలోని మాండ్య జిల్లా. తండ్రి మహాదేవ చిరు కాంట్రాక్టర్. ఐదో తరగతి వరకు సొంతూరు గోవిందనగరలోనే చదివిందీ అమ్మాయి. ఆరో తరగతి నుంచి చాలా దూరం వెళ్లాలి. లేదంటే చదువు మానుకోవాలి. అప్పుడే భావన వాళ్ల అమ్మకు గతం గుర్తొచ్చింది. తనలా తన కూతురు కాకూడదనుకుంది. కానీ ఊరు దాటితే వాళ్లకిఉపాధి కష్టం. అయినా సరే... ఉన్న కాస్త పొలాన్నీ అమ్మి ఆమె చదువు కోసం పట్నం వెళ్లాలని తీర్మానించుకుందా తల్లి. అలా మైసూరుకు వచ్చిన భావనకు పీజీ అయ్యేంత వరకు అమ్మానాన్నల త్యాగమే గుర్తొచ్చేది. కొత్త ఊరిలో పనులు దొరక్క నాన్న ఇబ్బంది పడుతుంటే పెద్ద కూతురుగా ఆ అమ్మాయి చాలా బాధపడింది. కానీ వాళ్లు పొలం అమ్మి మరీ మైసూరుకు ఎందుకు వచ్చారో.. ఆ లక్ష్యం నెరవేరాలంటే బాగా చదవాలనుకుంది. అలాగని కష్టపడి చదవటమంటే భావనకు నచ్చదు. ప్రతి నిమిషం పుస్తకాలతో గడపటం అసలే ఇష్టముండదు. అధ్యాపకులు చెప్పేది శ్రద్ధగా వింటే మళ్లీ పుస్తకాలు అదే పనిగా చదవక్కర్లేదు అంటోంది. అందరిలా మక్కికి మక్కీ కాక సొంత శైలిలో జవాబివ్వటమే తన విజయ సూత్రమని చెబుతోంది. పదిలో 94శాతం, ఇంటర్‌లో 95.6 శాతం, డిగ్రీలో బంగారు పతకం, తాజాగా మైసూర్ విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెస్సీ కెమిస్ట్రీలో 19 స్వర్ణాలు సాధించిన భావనకు ఐఏఎస్ కావాలన్నది జీవిత లక్ష్యం. సాధనా మొదలు పెట్టింది. అదీ సాధించగలదని మీకూ నమ్మకం కలుగుతోంది కదూ...
ఇదీ చదవండి: రాజీనామా చేసి 3 రాజధానులపై ప్రజల తీర్పును కోరండి: చంద్రబాబు