రెండు డోసుల టీకాలు(Corona Vaccine) తీసుకున్న వారికి కొవిడ్ నుంచి రక్షణ లభిస్తోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కొవిడ్‌తో సీరియస్ అయ్యే రోగుల శాతం తగ్గడమే కాదు.. మరణాలూ చాలా తక్కువగా ఉంటున్నాయని పరిశోధనలో తేలింది. రెండో ఉద్ధృతి అధికంగా ఉన్న ఏప్రిల్ 24 నుంచి మే 31 మధ్య కొవిడ్ బారిన పడ్డ రోగులపై సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ), ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని చేపట్టాయి. టీకా తీసుకున్న తర్వాత కొవిడ్ సోకడం(బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్)పై ప్రధానంగా పరిశోధన సాగింది. మొత్తం 1,161 మంది రోగుల సమాచారాన్ని విశ్లేషించారు. వీరిలో 495మంది టీకా తీసుకున్నవారు కాగా.. 666మంది టీకా తీసుకోనివారు. వ్యాక్సిన్ తీసుకోని వారితో పోలిస్తే తీసుకున్న వారిలో పదిరెట్లు అధికంగా యాంటీబాడీస్‌ఉన్నట్లు తేలింది.
- టీకా వేసుకున్నాక(Corona Vaccine)కొవిడ్ బారిన పడి సీరియస్ అయిన వారి శాతం 3.2గా ఉండగా.. అసలు టీకాలు తీసుకోని వారిలో ఇది 7.2 శాతం ఉన్నట్లు గుర్తించారు.
- టీకా(Corona Vaccine)తీసుకున్న వారిలో ఐసీయూ చికిత్స అవసరమైనవారు 3.8శాతం, వెంటిలేటర్ వరకు వెళ్లినవారి శాతం 2.8గా ఉంటే.. తీసుకోని వారిలో ఇది 4.7 శాతం, 5.9శాతంగా ఉంది.
- వ్యాక్సిన్(Corona Vaccine)వేసుకోని వారిలో కొవిడ్ మరణాలు 3.5 శాతం ఉంటే.. వేసుకున్నవారిలో 1.5 శాతమే.
వ్యాప్తిలో డెల్టారకం..
ఏప్రిల్, మే నెలలో చేపట్టిన పరిశోధన సమయంలో డెల్టారకం ఎక్కువగా వ్యాప్తిలో ఉన్నట్లు జన్యుక్రమ విశ్లేషణలో తేలింది. 201 నమూనాల జన్యుక్రమాలను కనుగొన్నారు. ఇందులో టీకాలు(Corona Vaccine) తీసుకున్న వారి 97 నమూనాలు విశ్లేషించగా.. మొత్తం 97 మందిలో డెల్టారకం బయటపడింది. టీకాలు(Corona Vaccine) తీసుకోనివారిలో 104 నమూనాలను విశ్లేషించగా 94 మందిలో డెల్టారకం (బి.1.617.2) ఉన్నట్లు తేలింది.