Twin Reservoirs : తెలంగాణలోని హైదరాబాద్‌లో అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. అకస్మాత్తుగా కురిసిన వానకు నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. రహదారులపైకి వరద నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. పనులపై బయటకు వెళ్లే వారంతా ఇబ్బందులు పడుతున్నారు.
ఏకధాటిగా కురిసిన వర్షానికి భాగ్యనగరంలోని జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. ఉస్మాన్‌సాగర్‌కు వరద ప్రవాహం పోటెత్తింది. ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1,790 అడుగులు కాగా.. ప్రస్తుతం 1,787 అడుగుల మేర నీరు నిలిచింది. ఉస్మాన్‌సాగర్ జలాశయానికి ప్రస్తుతం 1,200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది.