ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జోరువాననూ లెక్క చేయకుండా.. లక్ష్యం వైపే నడక - పశ్చిమగోదావరి జిల్లాలో రాజధాని రైతుల పాదయాత్ర

28th Day Farmers Padayatra: అమరావతి రైతుల మహాపాదయాత్ర 28వ రోజూ కదనోత్సాహంతో సాగింది. జోరువాననూ లెక్కచేయక రైతులు... లక్ష్యంవైపు నడక సాగించారు. స్థానికులు, వివిధ ప్రజాసంఘాలు, విపక్ష నాయకులు ఎక్కడికక్కడ ఎదురెళ్లి కర్షకులను స్వాగతించారు. వారిపై పూల వర్షం కురిపిస్తూ.. కలిసి అడుగులు వేశారు.

padayatra
28వ రోజు అమరావతి రైతుల మహాపాదయాత్ర

By

Published : Oct 9, 2022, 5:54 PM IST

Updated : Oct 9, 2022, 7:31 PM IST

28th Day Farmers Padayatra: ఏకైక రాజధాని డిమాండ్‌తో అమరావతి నుంచి అరసవల్లికి రైతులు చేస్తున్న మహాపాదయాత్ర... 28వ రోజున పశ్చిమగోదావరి జిల్లాలో ఉత్సాహంగా కొనసాగింది. పాలకొల్లు బ్రాడీపేట నుంచి ప్రారంభమైన పాదయాత్ర... కవిటం మీదుగా పెనుగొండ వరకు సాగింది. సుమారు 14 కిలోమీటర్ల మేర రైతులు నడిచారు. జోరుగా వర్షం కురుస్తున్నా గొడుగులు పట్టుకుని ముందడుగు వేశారు.

పాదయాత్రికులకు అడుగడుగునా స్థానికుల అపూర్వ స్వాగతం లభించింది. పోడూరు మండలం కవిటం లాకుల వద్ద మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆధ్వర్యంలో... చెరుకుగడలు, వరి దుబ్బులు, పసుపు మొక్కలు పట్టుకుని రైతులకు స్వాగతం పలికారు. ఇందుకోసం ఆచంట రైతులు, కర్షక సంఘాల నాయకులు భారీగా తరలివచ్చారు. కవిటం వినాయక గుడి వద్ద పూజలు నిర్వహించిన అమరావతి రైతులు... ఏకైక రాజధాని లక్ష్యాన్ని సాధించి తీరతామని మోకాళ్లపై నిలబడి ప్రమాణం చేశారు.

మహిళా సంఘాలు, వివిధ వర్గాల నాయకులు... అమరావతి రైతులకు సంఘీభావంగా యాత్రలో నడిచారు. కర్షకులను కన్నీటిపాలు చేయడం ప్రభుత్వానికి మంచిది కాదని హితవు పలికారు.

పాదయాత్ర చేస్తున్న మహిళలకు స్థానికులు ఎదురెళ్లి బొట్టు పెట్టి ఆహ్వానించారు. పోడూరు మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు పాదయాత్ర జరుగుతున్న ప్రాంతానికి తరలివచ్చారు. రైతుల యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. సాయంత్రానికి పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ చేరుకున్న రైతులు... రాత్రికి అక్కడే బస చేశారు. సోమవారం పాదయాత్రకు విరామం ప్రకటించారు.

జోరువాననూ లెక్క చేయకుండా.. లక్ష్యం వైపే నడక

ఇవీ చదవండి:

Last Updated : Oct 9, 2022, 7:31 PM IST

ABOUT THE AUTHOR

...view details