ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

White challenge in telangana : వైట్ ఛాలెంజ్ ఏంటి? రేవంత్​పై కేటీఆర్ పరువునష్టం దావా ఎందుకేశారు? - revanth threw white challenge to ktr

మాటకు మాట.. ట్వీట్‌కు ట్వీట్‌... సవాల్‌కు ప్రతిసవాల్‌! మంత్రి కేటీఆర్.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిల మధ్య రగిలిన రగడ తారాస్థాయికి చేరింది. రేవంత్ వైట్ ఛాలెంజ్​పై స్పందించిన కేటీఆర్.. రాహుల్​ కూడా రావాలని ట్వీట్ చేయగా.. ప్రతిస్పందించిన పీసీసీ చీఫ్ బరిలోకి సీఎం కేసీఆర్​ను లాగారు. రేవంత్ వ్యాఖ్యలపై కోర్టు కెక్కిన కేటీర్.. తన పరువుకు భంగం కలిగిస్తున్నారని దావా వేశారు. యువతకు ఆదర్శంగా ఉండాలనే వైట్‌ ఛాలెంజ్‌ ప్రతిపాదన చేసినట్టు రేవంత్‌ తెలిపారు. కేటీఆర్ ఎప్పుడు సవాల్‌ స్వీకరించినా.... తమకు అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు.

White challenge in telangana
White challenge in telangana

By

Published : Sep 21, 2021, 10:04 AM IST

పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఒకరు ట్వీట్‌ చేస్తే దానికి ప్రతిగా మరొకరు కౌంటర్‌ ఇస్తున్నారు. ఆ ఇద్దరి ట్వీట్ల వార్‌తో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. డ్రగ్స్‌ పరీక్షలపై రేవంత్‌రెడ్డి విసిరిన వైట్‌ ఛాలెంజ్‌పై కేటీఆర్ స్పందించారు. తాను ఎలాంటి పరీక్షలకైనా సిద్ధమేనని.. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సిద్ధమా? అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

‘రాహుల్‌ ఒప్పుకొంటే దిల్లీ ఎయిమ్స్‌లో పరీక్షలకు తాను సిద్ధమనీ.. తనది చర్లపల్లి జైలుకు వెళ్లొచ్చిన వారి స్థాయి కాదని స్పష్టంచేశారు. పరీక్షల్లో క్లీన్‌చిట్‌ వస్తే రేవంత్‌ క్షమాపణ చెప్పి పదవులు వదులుకుంటారా అని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో లై-డిటెక్టర్‌ పరీక్షలకు సిద్ధమా' అని రేవంత్‌కు కౌంటర్‌ ఇచ్చారు.

దీనిపై స్పందించిన రేవంత్‌ రెడ్డి... సీఎం కేసీఆర్​తో కలిసి లై-డిటెక్టర్‌ పరీక్షకు తాను సిద్ధమని.. దీనికి సమయం, స్థలం చెప్పాలన్నారు. సీబీఐ కేసులు, సహారా పీఎఫ్ అక్రమాలు, ఈఎస్​ఐ ఆస్పత్రుల నిర్మాణంలో అక్రమాలపై లై-డిటెక్టర్‌ పరీక్షలకు కేసీఆర్ సిద్ధమా అని రేవంత్‌ సవాల్‌ విసిరారు.

మరోవైపు రేవంత్‌ ట్విటర్‌లో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేటీఆర్ మళ్లీ స్పందించారు. తనపై ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న దుష్ప్రచారంపై కోర్టులో పరువునష్టం దావా వేసినట్లు తెలిపారు. దుష్ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలకు కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. మాదకద్రవ్యాల కేసుతో ముడిపెడుతూ తప్పుడు ఆరోపణలు చేసి తన ప్రతిష్టకు భంగం కలిగించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. పరువునష్టం చర్యలుగా పరిగణించి పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాల ద్వారా బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పేలా రేవంత్‌రెడ్డిని ఆదేశించాలని కోరారు. తన పరువుకు భంగం కలిగించేలా చేసిన వ్యాఖ్యలను తొలగించేలా ఆదేశించాలన్నారు. తప్పుడు ఆరోపణలు చేయకుండా నియంత్రిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

రేవంత్‌రెడ్డి నుంచి పరువునష్టం పరిహారం కోరేందుకు అవసరమైన మరిన్ని వివరాలను సేకరిస్తున్నాని.. తగిన సమయంలో కోర్టుకు విన్నవిస్తానని తెలిపారు. మంత్రిగా, తెరాస నేతగా తనకు రాష్ట్రంతోపాటు దేశ, విదేశాల్లో పేరు, ప్రతిష్టలున్నాయన్న కేటీఆర్..... పీసీసీ అధ్యక్ష పదవిని దుర్వినియోగం చేస్తూ తన ప్రతిష్ట దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. క్రిమినల్ కేసులను... రాజకీయ ప్రత్యర్థుల పరువు, ప్రతిష్టను దెబ్బతీసేందుకు వాడుకోరాదన్నారు. తనకు ఏ దర్యాప్తు సంస్థ నుంచి నోటీసులు రాలేదని.. అయినప్పటికీ రేవంత్‌రెడ్డి దురుద్దేశంతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.

తెలంగాణ సమాజానికి, యువతరానికి ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో... వైట్‌ ఛాలెంజ్‌ ప్రతిపాదన చేశానని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. డ్రగ్స్‌ వ్యవహారంతో సంబంధం లేదని కేటీఆర్ చెప్పడంతోనే సవాల్‌ చేసినట్టు రేవంత్‌ రెడ్డి తెలిపారు. ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పరీక్షల నిమిత్తం రక్తం, వెంట్రుకలు ఇచ్చి చిత్తశుద్ధి చాటుతూ... యువతలో విశ్వాసం కల్పించాలన్నదే తన ఆలోచన అన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయం, ఎన్నికల ప్రయోజనాలు లేవన్నారు. సవాల్‌ స్వీకరించమంటే కేటీఆర్ కోర్టుకు ఎందుకు వెళుతున్నారని ప్రశ్నించారు. మంత్రిగా ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి జవాబుదారీగా ఉండాలని రేవంత్‌ రెడ్డి సూచించారు.

రేవంత్‌ వైట్‌ ఛాలెంజ్‌ను స్వీకరించిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి... హైదరాబాద్ గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్దకు వచ్చారు. ఆయనతోపాటు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దసంఖ్యలో వచ్చి ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాలు నిషేధించాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు.. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ అంటూ బ్యానర్లు ప్రదర్శించారు. ధర్నాలో పాల్గొన్న రేవంత్‌.. యువతకు విశ్వాసం కల్పించేందుకే వైట్ ఛాలెంజ్ విసిరినట్టు స్పష్టంచేశారు. రేవంత్ విసిరిన వైట్ ఛాలెంజ్‌ను స్వీకరించిన కొండా విశ్వేశ్వరరెడ్డి... మంత్రి కేటీఆర్ కూడా గన్‌పార్క్‌కు వస్తే బాగుండేదన్నారు.

వైట్‌ ఛాలెంజ్‌ స్వీకరించాలంటూ... కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి చేసిన సవాల్‌పై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పందించారు. తనకు ఎలాంటి అలవాటు లేదని... ప్రజా సంగ్రామ యాత్ర ముగిసిన అనంతరం ఏ పరీక్షకైనా సిద్ధమని వెల్లడించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు తెరాస, కాంగ్రెస్‌లు వైట్‌ ఛాలెంజ్‌ను తెరపైకి తెచ్చాయని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details