గిడుగు రామ్మూర్తి తెలుగు వ్యావహారిక భాషోద్యమానికి మూల పురుషుడు కాగా.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలుగు భాష విధ్వంసకుడిగా తయారు కావడం దురదృష్టకరమని ఏపీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శించారు. ప్రపంచంలో ఎక్కువమంది మాట్లాడే భాషల్లో తెలుగు 7వ స్థానంలో ఉందని.. మన దేశంలో నాలుగో స్థానంలో ఉందన్నారు. శ్రీకృష్ణదేవరాయలు 'దేశ భాషలందు తెలుగు లెస్స' అని కీర్తించారని.. తెలుగువారి వారసత్వపు ఆస్తి తెలుగును మరింత మెరుగుపరిచి భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
రాష్ట్రంలో వైకాపా.. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమం రద్దు చేసి దాని స్థానంలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టాలని నిర్ణయించడం ఒక చారిత్రక తప్పిదమని తులసిరెడ్డి విమర్శించారు. ఇదే జరిగితే మన తెలుగు భాష అచిరకాలంలోనే కాలగర్భంలో కలిసిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలానే కొనసాగితే తెలుగు జాతి అస్తిత్వమే ప్రశ్నార్ధకం అవుతుందన్నారు. వైకాపా ప్రభుత్వం తెలుగు మాధ్యమం రద్దు చేయాలన్న నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించారు.