రాజధానిపై వైకాపా ఎన్నికలకు ముందు ఓ మాట... అధికారంలోకి వచ్చిన తరువాత మరో మాట చెబుతోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి విమర్శించారు. రాజధానిని మారుస్తామని ఎన్నికలకు ముందే ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. కడపలో మాట్లాడిన ఆయన... అమరావతి విషయంలో వైకాపా తీరుపై మండిపడ్డారు. మోసగాడు కాదు అని సీఎం జగన్ నిరూపించుకోవాలంటే... అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు.
మూడు రాజధానుల పేరుతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారని తులసిరెడ్డి అన్నారు. హైకోర్టు ప్రాంతాన్ని రాజధానిగా ఎక్కడా పిలవరని చెప్పారు. సీఎం జగన్ రాజధానిని మూడు ముక్కలు చేసి అరచేతిలో కైలాసం చూపిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం మోసం చేస్తోందని మండిపడ్డారు. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంటులో చేసిన ప్రత్యేకహోదా ప్రకటనను కేంద్రం అమలు చేయాలని డిమాండు చేశారు. ప్రత్యేక హోదా సాధించలేని భాజపా, తెదేపా, వైకాపాలు రాష్ట్రానికి దుష్ట త్రయ పార్టీలుగా మారాయని విమర్శించారు.