Police Preliminary Examination: పోలీస్ నియామకాల్లో కీలకమైన ప్రాథమిక రాతపరీక్షను ఆగస్టులో నిర్వహించేందుకు ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 7న ఎస్సై పోస్టులకు సంబంధించిన పరీక్ష నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) సన్నాహాలు చేస్తోంది. అదే నెల 21న కానిస్టేబుల్ పోస్టులకు పరీక్షలు నిర్వహించనున్నారు. అనుకోని అవాంతరాలు ఎదురుకాకపోతే దాదాపుగా ఇవే తేదీలు ఖరారు కానున్నాయి.
ఒకవేళ ఆ తేదీల్లో టీఎస్‌పీఎస్సీకి సంబంధించిన పరీక్షలు ఉంటే స్వల్ప మార్పులు చోటుచేసుకోవచ్చు. తెలంగాణలో ఈసారి భారీఎత్తున 17,291 పోస్టులను టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో 587 ఎస్సై పోస్టులు కాగా.. మిగిలినవన్నీ కానిస్టేబుల్ పోస్టులే. ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు కలిపి మంగళవారం సాయంత్రం వరకు సుమారు 12.1 లక్షల దరఖాస్తులొచ్చాయి.
ఈ నెల 26న గడువు ముగిసే నాటికి సుమారు 14 లక్షల దరఖాస్తులు రావొచ్చని, వీటిలో కానిస్టేబుల్ పోస్టుల దరఖాస్తులే 9-11 లక్షలు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాథమిక రాతపరీక్షలకు సంబంధించి జూన్ 10 నాటికి కసరత్తు పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. హాల్‌టికెట్ల జారీతోపాటు పరీక్ష కేంద్రాల ఎంపిక ప్రక్రియను అప్పటిలోగా పూర్తి చేయనున్నారు.