TSCO Handlooms : తెలంగాణ చేనేత రంగానికి పెద్ద దిక్కయిన రాష్ట్ర సహకార సంఘం (టెస్కో) కరోనా ప్రభావంతో కుదేలయింది. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలకు ఏకరూప దుస్తులు, దుప్పట్ల పంపిణీ కోసం రెండేళ్లుగా ఆర్డర్లు రావడం లేదు. మరోవైపు దుకాణ సముదాయాల్లో వస్త్రాల అమ్మకాలు తగ్గాయి. ఆదాయం గణనీయంగా తగ్గింది. గతంలో డిమాండు దృష్ట్యా సంఘాల్లో రెండు పూటలా కార్మికులకు పనులు ఉండేవి. ఇప్పుడు ఒక పూటే పని లభిస్తోంది.
గతంలో ఏటా రూ.90 కోట్ల ఆర్డర్లు:టెస్కోలో 380 గ్రామస్థాయి ప్రాథమిక చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. కార్మికులు చేనేత సహకార సంఘాల ద్వారా టెస్కోకు వస్త్రాలు సరఫరా చేస్తున్నారు. టెస్కో ఆ వస్త్రాల అమ్మకానికి తెలంగాణలోని 37 పట్టణాల్లో, ఉత్తర భారతదేశంలో 9 నగరాల్లో షోరూములను ఏర్పాటు చేసింది. అలాగే ప్రభుత్వ శాఖల ద్వారా ఆర్డర్లు పొంది వాటిని ఉత్పత్తి చేయించి పంపిణీ చేస్తుంది. ఏటా పాఠశాల విద్యాశాఖ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యాలయ సంస్థల ద్వారా రూ.90 కోట్ల మేరకు ఆర్డర్లు వస్తుంటాయి. పాఠశాలలు, గురుకులాలు తెరిచేనాటికి దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేయడం రివాజు. 2020లో కొవిడ్ కారణంగా పాఠశాలలు మూతపడ్డాయి. 2021లోనూ కరోనా కొనసాగడంతో ఆ సంవత్సరాల్లో ఆర్డర్లు లభించక సంస్థ బాగా నష్టపోయింది. 2022 సంవత్సరానికి సైతం ఇప్పటి వరకు ఆర్డర్లు రాలేదు. వాస్తవానికి ఏటా జనవరిలోపే టెస్కోకు ఆర్డర్లు ఇవ్వాలి. అయిదు నెలల్లోపు వాటిని తయారు చేయించి పంపిణీ చేయాలి.
పేరుకుపోయిన నిల్వలు:కరోనా కారణంగా టెస్కో దుకాణ సముదాయాల్లో విక్రయాలు 50% తగ్గాయి. ఏటా రూ.300 కోట్ల మేరకు ఆదాయం దుకాణాల్లో విక్రయాల ద్వారా వస్తుంది. 2020 నుంచి కొవిడ్ ప్రారంభం కాగా... చాలా నెలల పాటు దుకాణాలు మూసే ఉన్నాయి. 2021లోనూ ఇదే పరిస్థితి. దీంతో రూ.200 కోట్ల అమ్మకాలు తగ్గాయి. గోదాముల్లో, దుకాణాల్లో నిల్వలు పేరుకుపోయాయి.