కరోనా పరీక్షలు తగ్గడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన తెలంగాణ హైకోర్టు.. రోజుకు లక్ష పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. సంచార వ్యానుల ద్వారా ఎన్ని పరీక్షలు చేశారో చెప్పాలని స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీలో టోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటు చేశామని ప్రభుత్వం తెలపగా.. వారంలోగా అన్ని జిల్లాల్లో టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఖైదీలు, నిరాశ్రయులకు టీకాలు ఎలా వేస్తారో తెలపాలని కోరింది.
కరోనాపై నిపుణుల కమిటీ
ఆక్సిజన్ రాకుండా తమిళనాడు అడ్డుకుంటోందని ఆరోగ్య సంచాలకులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తమిళనాడు నుంచి ఆగిపోయిన ఆక్సిజన్‌కు బదులుగా.. ఇతర రాష్ట్రాల నుంచి సమకూర్చాలని కేంద్రాన్ని కోరిన హైకోర్టు .. చర్యలు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని సూచించింది. రెండ్రోజుల్లో కరోనాపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించిన హైకోర్టు.. సమావేశాల వివరాలు సమర్పించాలని ఆదేశించింది. కొవిడ్ మృతులకు సంబంధించి శ్మశానవాటికల్లో సదుపాయాల వివరాలు తెలపాలని సూచించింది.
ఇదీ చదవండి:తల్లి చనిపోయినా.. తండ్రి కోసం తనయుడి ఆరాటం!
24 గంటల్లో ఉత్తర్వులు
శుభకార్యాల్లో 200 మంది, అంత్యక్రియల్లో 50 మంది మించరాదన్న హైకోర్టు.. వివాహాలు, అంత్యక్రియల్లో ఆంక్షలపై 24 గంటల్లో ఉత్తర్వులు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఫంక్షన్ హాళ్లు, పార్కులు, మైదానాల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఆర్టీపీసీఆర్ ఫలితాలు 24 గంటల్లో వచ్చేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త వైరస్ వేరియంట్‌పై ఆందోళన వ్యక్తం చేసిన హైకోర్టు.. ఏపీ నుంచి రాకపోకలకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
డీజీపీ హైకోర్టుకు వివరణ
కరోనా నిబంధనల పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని డీజీపీ మహేందర్‌రెడ్డి హైకోర్టుకు వివరించారు. పర్యవేక్షణకు 859 పెట్రోలింగ్, 1,523 ద్విచక్రవాహనాలు ఉపయోగిస్తున్నామని తెలిపారు. ఆస్పత్రుల వద్ద పోలీసు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డీజీపీని ఆదేశించిన హైకోర్టు.. మాస్కులు ధరించనివారి వాహనాలు జప్తు చేసే అంశం పరిశీలించాలని సూచించింది. అందుకోసం పోలీసులకు తగిన అధికారాలు కల్పించే అంశం పరిశీలించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. భౌతికదూరం పాటించని సంస్థలపైనే కేసులు పెడుతున్నామని.. భౌతికదూరం పాటించని వ్యక్తులపై కేసులు నమోదు చేయడం లేదని డీజీపీ హైకోర్టుకు విన్నవించారు. ఔషధాల అక్రమ విక్రయాలపై కఠినంగా వ్యవహరించాలని హైకోర్టు స్పష్టం చేయగా.. 39 కేసులు నమోదు చేశామని డీజీపీ వివరించారు.
ఇదీ చదవండి:
రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ: అమల్లోకి కఠిన ఆంక్షలు