తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడు కస్టోడియల్ మృతిపై న్యాయవిచారణకు హైకోర్టు ఆదేశించింది. మరియమ్మ మృతిపై న్యాయవిచారణ జరిపి వారం రోజుల్లో సీల్డ్కవర్లో నివేదిక సమర్పించాలని ఆలేరు మేజిస్ట్రేట్‌ను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అవసరమైతే.. మరియమ్మ మృతదేహాన్ని వెలికి తీసి రీ-పోస్టుమార్టం జరపాలని స్పష్టం చేసింది.
వెల్లువెత్తిన ఆరోపణలు..
దొంగతనం ఆరోపణలపై పోలీసులు అదుపులోకి తీసుకున్న మరియమ్మ అనుమానాస్పద మృతిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. మరియమ్మ పోలీసుల వేధింపుల వల్లే మరణించారని.. న్యాయ విచారణ జరపాలని కోరుతూ పీయూసీఎల్ ప్రధాన కార్యదర్శి జయ వింధ్యాల దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. మరియమ్మ మృతిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం వ్యవహరించినట్లు అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తెలిపారు. కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసి ఏసీపీతో విచారణ జరుపుతున్నట్లు, పోలీసులు వేధించలేదని.. పోస్టుమార్టంను వీడియో చిత్రీకరించామని వివరించారు.