తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి.. ఎంసెట్ 2021 నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈనెల 20 నుంచి మే 18 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు.. కన్వీనర్ గోవర్ధన్ వెల్లడించారు. జూలై 5 నుంచి 9 వరకు జరగబోయే ఈ పరీక్షలను.. ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఈ ఏడాది అపరాధ రుసుము లేకుండా 60 రోజులపాటు దరఖాస్తులకు అవకాశమిచ్చినట్లు కన్వీనర్ తెలిపారు. ఆ తర్వాత.. ఆలస్య రుసుముతో జూన్ 28 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వివరించారు. కరోనా నేపథ్యంలో అపరాధ రుసుములను 50 శాతం తగ్గించామన్నారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్.. రెండింటికి కలిపి ఒకటిగా... లేదంటే వేర్వేరుగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు వివరించారు. పొరపాట్లు సరిదిద్దుకునేందుకు.. ఈ సారి కొన్ని వివరాలకు మాత్రమే ఎడిట్ ఆప్షన్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.