కరోనా వైరస్ వ్యాప్తి నివారణ, లాక్డౌన్ అమలు, సహాయక చర్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, ముఖ్యకార్యదర్శులు ఎస్.నర్సింగ్‌రావు, రామకృష్ణారావు పాల్గొన్నారు.
హైదరాబాద్, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో మినహా తెలంగాణ రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో పరిస్థితి అదుపులోనే ఉందన్న ముఖ్యమంత్రి... కొత్తగా నమోదవుతున్న కేసులన్నీ హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోనే ఉన్నాయన్నారు. హైదరాబాద్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఎవరికి వ్యాధి లక్షణాలు కనిపించినా వెంటనే పరీక్షలు నిర్వహించి.. అవసరమైతే చికిత్స చేయించాలని ఆదేశించారు. పాజిటివ్ అని నిర్ధరణ అయిన వ్యక్తి కాంటాక్టులు అందరిని క్వారంటైన్ చేయాలని ఆదేశించారు.